Tuesday, May 23, 2017

Railing Repair

అలా బాల్కానీ నుండి తొంగి చూస్తుండగా - రేయిలింగ్ Railing కి ఉన్న ఇనుప పట్టీ వదులై అసహ్యముగా కనపడసాగింది. అలాగే వదిలేస్తే మరింతగా పాడేయ్యేలా ఉంది. అప్పట్లో స్క్వేర్ ఐరన్ ట్యూబ్ Square Iron Tube కి డిజైన్ వచ్చేది కాదు. ఆ చదరపు ట్యూబ్ నీ, ఆ డిజైన్ పట్టీని విడివిడిగా వంచి, ఒక్కటిగా దగ్గరకు చేర్చి, వెల్డింగ్ చేశారు. ఈ పని బాగుంది. కానీ కాసింత శ్రద్ధ ( అంటే పట్టీకి ట్యూబ్ కీ మధ్యన ఉండే సన్నని గ్యాప్ ని లప్పం గానీ, సిమెంట్ ద్వారా గానీ పూత వేసి మూసేయ్యలేదు ) తీసుకోక అందులోకి వర్షం నీరు, ఉతికిన బట్టల నీళ్ళూ పడీ, అందులోకి వెళ్ళి... త్రుప్పు పట్టి అ రెండింటి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇలా అవుతుందని ఆ వెల్డర్ గానీ, ఇటు పెయింటర్ గానీ చెప్పలేదు.. ఎవరి స్వార్థాలు వారివి. మనకా తెలీదు. సో, చివరకు బలయ్యేది మనమే.. 

వర్షపు నీరు ఆ సందులోకి చేరి, మరింత త్రుప్పు పట్టేలా చేస్తూ, అక్కడే ఆవిరయ్యేది. ఫలితముగా ఇనుప పట్టీ తడి ఆరిపోగానే సన్నని ఇనుప రజనులా రాలిపోయి, ఆ ట్యూబ్ కీ, పట్టీకీ మరింతగా దూరం చేసింది.. ఫలితముగా అక్కడక్కడా నా చిటికెన వ్రేలు పట్టేలా దూరం జరిగాయి. 

అలా ఉండటం వల్ల వ్రేళ్ళు ఇరుక్కోవడం, త్రుప్పు పట్టడం వల్ల అది సన్నగా అయ్యి, కోసుకపోయేలా మారింది. పెద్దవాళ్ళకే ఇబ్బందిగా ఉంటే ఇక పిల్లల సంగతి..? వామ్మో..! తలుచుకుంటే భయంకరముగా తోచింది. దాన్ని బాగుచేద్దామంటే - వెల్డర్ వచ్చి, చూసి, అది పూర్తిగా తొలగించి, షాపుకి తీసుకరండి. చేసిస్తాను అని అన్నాడు. తన చార్జెస్ ఒక వేయి తీసుకుంటాను అన్నాడు. అదీ నన్ను చూసి.. లేకుంటే ఇంకో ఐదు వందలు అదనంగా చెప్పేవాడట. 

ఇక్కడ వర్షం నీరు పడకుండా ఆపే పరిస్థితి లేదు.. బాల్కానీ కాబట్టి. ఉతికిన బట్టలు అక్కడే ఆరేస్తాం కాబట్టి దాన్నీ నివారించలేం... ఈ వెల్డర్ + పెయింటర్ ల తప్పు వల్ల ఇప్పుడు వెల్డర్ కి 1500 + రెయిలింగ్ గ్రిల్ తీయించినందులకు 350 + రానుపోను రిక్షా 200 + మళ్ళీ బిగించటానికి మేస్త్రీ ఖర్చు 650 + తన సహాయకుడికి 350 + పెయింటర్ కి 1000 + పెయింట్స్ కి 600...........( ఇక్కడి వరకే Rs. 4650 )  ఇదీ ఖర్చు. ఇవి కనిపించేటివి. ఇక కనిపించనివి - అక్కడే ఉండి నిర్వహణ చూసుకోవాలి - ఇది ఒకరోజు మన సమయం, కూలీలని, రిక్షానీ, సిమెంట్, పెయింట్స్ తేవటానికి అయ్యే ఖర్చులూ అదనం.. చూశారా !.. చిన్న పొరబాటుకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. అందుకే ఇంటి నిర్వహణ అంత వీజీ కాదు.. అన్నీ బాగుండేలా చూడాలంటే చాలా చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలి.. అవును.. చిన్న చిన్న విషయాలే.. బోర్ గా ఫీలయ్యి నేర్చుకోవటానికి ఇష్టపడం.. కానీ ఆ చిన్నపనులు మన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని మింగేస్తాయి. అందుకే ఇలాంటి పనులు ఎలా చెయ్యాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి అయిపోయాక చేయి కాలింది అని తెలిశాక అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు విచారించటం తప్ప మరేమీ చెయ్యలేం.. అందుకే ఇలాంటి విషయాల్ని మీకు తెలియాలని చెబుతున్నాను. ప్రపంచం లోని చాలామందికి ఇలాంటి విషయాలు చాలా అవసరం. ఇలాంటి విషయాలకు గూగుల్ లో వెదికితే ఏమి చెయ్యాలో తెలియడానికి ఇలాంటి పోస్ట్స్ కూడా పెట్టాల్సి వస్తున్నది. అందుకే చాలా వివరముగా వ్రాస్తున్నాను. నిజానికి ఇలాంటి పోస్ట్స్ కి బ్లాగ్ వీక్షకుల సంఖ్య బాగానే ఉంది. మామూలు పోస్ట్స్ కన్నా వీటికే వ్యూయర్ షిప్ Viewership  ఎక్కువగా ఉంది కూడా..  నా బ్లాగ్ స్టాటిస్టిక్స్ కూడా ఇది నిజమని ఋజువు చూపిస్తున్నది కూడా.. 

సరే.. ఇక అసలు విషయానికి వద్దాం.. 

ఆ గ్యాప్ లో ఏమి పెడితే బాగుంటుందో ఆలోచన చేశాను. వాల్ పుట్టీ పెడితే ?? అన్న ఆలోచన. బాగుంది కానీ అంత లావుగా అయితే పగుళ్ళు వచ్చి, ఊడిపోతుంది.. పోనీ M-seal లాంటిది పెడితే?? ఇది బాగుంటుంది కానీ అంత పెద్ద గ్యాపుల్లో దాన్ని నింపేసరికి ఖర్చు మరింతగా పెరిగిపోతుంది. మనకు తక్కువ ఖర్చులో - తక్కువ సమయంలో అంతా బాగా కావాలి. మరి ఎలా ? అని ఆలోచిస్తే - సిమెంట్ పెడితే..? వావ్.. మంచి ఆలోచన. అదే బెస్ట్ ఇది 10 - 20 రూపాయల్లో అయిపోతుంది. 

ముందుగా చదరపు ట్యూబ్ కీ, పట్టీకి మధ్యన జాగాలో ఉన్న తుప్పుని ఒక స్క్రూ డ్రైవర్ సహాయన వచ్చినంతవరకూ తొలగించాను. 

ఆ రెండింటినీ కలిపి ఉంచేలా చేసిన వెల్డింగ్ వద్ద ఉన్న త్రుప్పుని ఒక చిన్న సుత్తె సహాయన లోతుగా త్రుప్పుని రాలగొట్టాను. 

ఆ తరవాత మామూలు బైండింగ్ వైర్ ( ఇంటి స్లాబుల్లో స్టీలు వూచలని బంధించడానికి వాడేది ) కాకుండా GI వైర్ మీడియం మందముగా ఉన్నది తీసుకున్నాను. ఇందులో తేడా ఏమిటంటే - బైండింగ్ వైర్ కొద్ది కాలానికే త్రుప్పు పట్టి విరిగిపోతుంది. అదే GI వైర్ త్రుప్పు పట్టక అలాగే ఉంటూ గట్టిగా ఆ రెండింటినీ పట్టి ఉంచుతుంది. అందువల్ల ఇలాంటి చిన్న విషయాలు కీలకం. ఈ తీగ ఎల్లప్పుడూ అక్కడ వాతావరణానికి ఎక్స్ పోజ్ అవుతుంది. కాబట్టి ఇదే వాడమని సలహా. 

( ఇది చేసి, విజయం సాధిస్తానని నాకు తెలీదు. నా స్వంత ఆలోచన.. నిజానికి ఈ పనిలో సక్సెస్ అవుతాననీ తెలీదు. కనుక రెయిలింగ్ మొదట ఎలా పాడయ్యిందో చూపే ఫోటోలు తీయలేదు. అందులకు మన్నించండి. )

GI వైరుతో రెండు చుట్లు చుట్టి, కొనలని ముడివేసి, మెలి త్రిప్పాను. దీనివల్ల అది వాటిని దగ్గరగా లాగుతుంది. అలాగే గట్టిగా బంధించి ఉంచుతుంది. ఈ క్రింది ఫోటో చూడండి. 


ఆ తరవాత సన్నని ఇసుక, సిమెంట్, కాస్త నీరూ కలిపి చపాతి పిండిలా గట్టిగా కలుపుకోవాలి. 

ఆ రెండింటి గ్యాప్ లో ఆ సిమెంట్ వేసే ఒక నిమిషం ముందు - సిమెంట్ వేసే ప్రాంతాన్ని నీటితో తడుపుకోవాలి. ఇలా ఎందుకూ అంటే - ఆ సిమెంట్ మిశ్రమం ఆ ఇనుప రెయిలింగ్ గోడలకి గట్టిగా పట్టుకుంటుంది. చాలామంది మేస్త్రీలు ఈ చిన్న విషయాన్ని మరుస్తారు. ఫలితముగా పగుళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే కాస్త తడి ఉన్నప్పుడే సిమెంట్ వేసుకోవాలి. 

క్రింది వైపున అట్టముక్క లేదా ఎడమచేతిని వాడి, ఆ గ్యాప్ లో సిమెంట్ మిశ్రమాన్ని వేసి సన్నని తాపీతో అదమాలి. అలా పైవరకూ చేసి, కాసేపు ఆగాక ఒక చెక్క ముక్కతో లెవల్ చేసుకోవాలి. 

స్మూత్ / నునుపు ఫినిషింగ్ కావాలంటే ఒక లప్పం రేకుతో రాస్తే సరి.. నేను మాత్రం ఇక్కడ నీటిలో తడిపిన స్పాంజ్ ముక్కతో నునుపు చేశాను. ఫలితముగా గరకుగా వస్తుంది. ( అది ఆరాక వాల్ పుట్టీ ని లప్పం రేకు సహాయాన పూసి, స్మూత్ / నునుపు చేసి, ఎమరీ పేపర్ తో రుద్ది, మరీ నునుపు చెయ్యాలని నా ఆలోచన. ఆ తరవాత పెయింట్ వేస్తే ఇలా అయ్యిందని మనం చెబితే గానీ ఎవరూ తెలుసుకోలేరు..) 

అలా చేశాక నీటి తడులు చాలానే ఇచ్చాను. ఫలితముగా చాలా బాగా ధృడముగా ఆ రెయిలింగ్ మారింది. 


ఆ తరవాత ఈ రెయిలింగ్ గోడకి కలిసే చోట అక్కడ నీటి తేమ వల్ల పూర్తిగా పాడయ్యి, సన్నని పోచ మీద ఆగింది. ఇక్కడ నిలబడితే ఆధారం లేక పడిపోతామేమో అన్నంతగా భయం వేసేది. అంత ధృడమైన రెయిలింగ్ నీటి తేమ వల్ల త్రుప్పు పట్టి, సన్నని పోచలుగా మారింది.. రెండు పోచల తీగలా మారి దాని ఆధారముగా గోడకి ఫిక్స్ అయ్యింది. ( ఇది ఫోటో తీయటం మరిచా.. తీసుంటే అది ఏ మేరకు త్రుప్పు పట్టి పాడయ్యిందో తేలికగా తెలిసేది. అది గనుక మీరు చూసుంటే అది ఖచ్చితముగా క్రొత్త రెయిలింగ్ ని మార్చాలి అని అనేవాళ్ళు. నేను చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతం అవుతుందని నాకే నమ్మకం లేక... అలా ఫోటో తీయటం మరిచా. ఎందుకంటే ఇలా నేనెప్పుడూ చెయ్యలేదు. వేరేవారు చెయ్యగా నేనెప్పుడూ చూడలేదు ) దీనికీ చక్కగా సిమెంట్ వేశాను. వేశాక తడి స్పాంజ్ తో ఎక్కువైన  సిమెంట్ ని తొలగించాను. 

వారం రోజులు చక్కని నీటి తడులని ఇచ్చాను. బాగా గట్టిపడిపోయింది. బలముగా నెట్టినా ఏమాత్రం కదలనంతగా గట్టిగా మారింది. దూరం నుండి చూస్తే అది ఆ గ్రిల్ లోని భాగమే అన్నట్లు కుదిరిపోయింది. ఇలా వెయ్యక ముందు అక్కడ నిలబడాలంటేనే భయముగా తోచేది.. ఇప్పుడు మాత్రం చాలా గట్టిగా ఉండి, నమ్మకముగా ఆనుకొని ఉండేలా మారింది. 


ఇక కొద్దిరోజుల తరవాత వాల్ పుట్టీని లప్పం రేకుతో వేసి, ఎమరీ పేపర్ సహాయాన నునుపు చేసి, రంగు వెయ్యాల్సిన పని మిగిలింది. అదీ త్వరలోనే ముగిస్తాను. అప్పుడు ఈ గ్రిల్ అలా రిపేర్ చేశా అంటే ఎవరూ నమ్మకుండా తయారవుతుంది. క్రొత్త రెయిలింగ్ మాదిరిగా కనిపిస్తుంది. 

చూశారా ! ఎంత ఖర్చుని తప్పించి, తక్కువ ఖర్చులో బాగుచేసుకున్నాను కదూ.. మొత్తం ఖర్చు అంతా ఇరవై Rs. 20 రూపాయలకు మించలేదు.. ఇక వాల్ పుట్టీ, రంగులూ వంద లోపే అయిపోతాయి.. అవీ నేనే వేసుకుంటే. మొత్తానికి నా కాసింత శ్రమ, ఆలోచనతో  పెద్ద ఖర్చుని తొలగించుకున్నాను.

ఈ పద్ధతిని ఆరుబయట ఎండకు ఎండీ, వానకు నానే పాఠక్ / గేట్లు / జాలీ గేట్లు / గ్రిల్స్ కి శుభ్రముగా వాడుకోవచ్చును.

Railing repair

మీకు తేలికగా అర్థం కావటానికి  ఫోటోలు అన్నీ Extra Large మోడ్ లో అప్లోడ్ చేశాను. 

No comments:

Related Posts with Thumbnails