Tuesday, September 20, 2016

Good Morning - 612


మనకి ఉన్నవి రెండే సమస్యలు.. 
మొదటిది : దేన్ని గుర్తుంచుకోవాలో దాన్ని మరచిపోవడం. 
రెండవది : దేన్ని మరచిపోవాలో దాన్ని గుర్తుంచుకోవడం.. 

అవును.. మనుష్యులన్న వారికి ఉన్నవి స్థూలంగా ఉన్నవి రెండే రెండు సమస్యలు. ఈ సమస్యలన్నవి అత్యంత సాధారణం. ప్రతివారికీ తప్పవు. సమస్యలు తెచ్చి పెట్టే జ్ఞాపకాలల్లో వేటిని మరచిపోవాలి, వేటిని గుర్తుంచుకోవాలి అన్నదగ్గరే ఆ మనిషి ప్రతిభనీ, ఎదుగుదలనీ, భవిష్యత్తునీ చూపిస్తుంది. ఈ సమస్యల్లో ఉన్నవి రెండు రకాలు. 
1. దేన్ని గుర్తుంచుకోవాలో దాన్ని మరచిపోవడం, 
2. దేన్ని మరచిపోవాలో దాన్ని గుర్తుంచుకోవడం. 
ఇలా ఎందుకు అవుతుందీ అంటే ఆ జ్ఞాపకాల తాలూకు బలమైన సునామీ ప్రభావం నుండి బయటపడలేని అశక్తత. ఆ ప్రభావం తాలూకు నుండి ఎలా బయటపడాలీ అని చేసే ప్రయత్నాలలోనే మన ప్రజ్ఞ ఏమిటో బయటపడుతుంది.  

మరుపన్నది మానవ జన్మకి ఒక వరం.. అన్న నానుడి అక్షరాలా నిజం. కొన్ని విషయాలని ఇట్టే మరచిపోతాం - ఎంతగా అంటే అసలు అవి మనవరకూ వచ్చాయా? నాకు అస్సలే తెలీదే.. అన్నట్లుగా. మరికొన్ని మాత్రం మనల్ని జీవితాంతం వరకు వెంటాడుతూ, వేటాడుతూ ఉంటాయి. ఇవి ప్రతి మనిషికీ కొద్దో, గొప్పో ఉంటాయి. వీటిని తట్టుకోవాలంటే ఆ మనిషికి స్థితప్రజ్ఞత, చాలా మానసిక ధైర్యం ఉండాలి. ఇదే కాకుండా చక్కని తోడు కూడా ఉండాలి. ఈ తోడు అన్నది - సాటి మనిషా, పెంపుడు ప్రాణా, అలవాటా, ప్రకృతియా, అభిరుచియా, మరొకటా కావొచ్చు. ఈ తోడు వల్ల ఆ వెంటాడే జ్ఞాపకాల నుండి - పూర్తిగా కాకున్నా చాలావరకు బయట పడవచ్చును. 

ఇప్పుడు మీకు - ఒక చక్కని పరిష్కార మార్గాన్ని చెబుతున్నాను. ఇది వాడి నన్నునేనూ, ఇతరులకు చెప్పి, వారినీ వారికున్న వెంటాడే జ్ఞాపకాల నుండి చాలావరకు బయటపడేశాను. మీకు నచ్చితే మీరూ పాటించండి.. లేదా ఇతరులకీ చెప్పండి. 

ఒక సమస్య తాలూకు బాధ / జ్ఞాపకం మిమ్మల్ని చాలా వెంటాడుతూ, బాధ పెడుతూ ఉంటే గనుక - మీరు ఆ సమస్య తీవ్రతను బట్టి దాని ప్రభావం మిమ్మల్ని ఎంతకాలం వెంటాడగలదు, దాన్ని మీరు ఎంతకాలం లోగా ( ఒక గంటనా, పూటనా, రోజా, వారమా, పక్షమా, నెలనా, సంవత్సరమా .. ) దాన్ని తొలగించుకోవాలో అన్నది మీరు మీ మానసిక స్థితిని బట్టి స్పష్టముగా ఒక అంచనాకి రావాలి. ఈ అంచనా అన్నది మీరే నిర్ణయించుకోవాలి. ఆ తరవాత మీరు  పైన చెప్పిన తోడుతో గానీ, మీరంతట మీరుగానీ బయటపడగాలి. ఈ కాలం లోనే ఆ సమస్య / జ్ఞాపకం చేసే బాధ వల్ల మీరు బాధపడుతారా ? కన్నీరు కారుస్తారా? పొర్లి పొర్లి ఏడుస్తారా? సరి చెయ్యటానికి ప్రయత్నిస్తారా?.. అన్నది ఈ నిర్ణయించిన కాలంలోనే మాత్రమే చెయ్యాలి. ఆ గడువు తీరిన తరవాత మాత్రం ఇక ఆ ఆలోచన అస్సలు వద్దు. " నేను గడువు పెట్టుకున్న కాలంలోనే తీరలేదు.. ఇక తీరుతుందన్న ఆలోచనా లేదు.. నేను ఎంతగా చెయ్యాలో అంత చెయ్యాల్సింది చేశాను. ఇక అ దేవుడే నా సమస్యని తీర్చాలి.. " అని అనుకోవడం మొదలెట్టాలి. మీలో ఇక అ మరుపురాని జ్ఞాపకాలు వెంటాడటం క్రమంగా తగ్గటం మీరే గమనిస్తారు. మీరు ఖచ్చితముగా సంతోషముగా మారుతారు కూడా.  

నిజానికి పైన చెప్పిన టెక్నిక్ చిన్నగా చెప్పొచ్చు. అందరికీ చప్పున అర్థం కాకపోవచ్చని, అందరికీ అర్థమవ్వాలని ఇలా పెద్దగా చెప్పాను. చిన్నగా చెప్పాలంటే - 


వెంటాడే జ్ఞాపకాల నుండి  బయటపడాలంటే  - వాటి బాధలకు ఒక నిర్ణీత గడువుని పెట్టుకోండి. అందులోనే మీరు కవితలు వ్రాస్తారా? అరుస్తారా? పొర్లి పొర్లి ఏడుస్తారా? గింజుకుంటారా?.. అన్నది మీ ఇష్టం. ఆ గడువు తీరాక ఇక వద్దే వద్దు.. నా శక్తి మేరకూ 150% చెయ్యాల్సింది చేశాను.. నా అమూల్యమైన సమయం వృధా చేశా.. ఇక చాలు. అనీ.. 


No comments:

Related Posts with Thumbnails