Tuesday, April 5, 2016

2% కమీషన్

మొన్న ఆదివారం నాడు - నా మొబైల్ కి హెడ్ ఫోన్స్ కొనాలనుకొని బయలుదేరాను. క్రొత్త క్రొత్త చోట్లలో షాపింగ్ చెయ్యడం నాకు అలవాటు. అలా ఎందుకూ అంటే ఎప్పుడూ ఒకేచోట కొంటూనే ఉంటుంటే - బావిలోని కప్పలా మారిపోతాను అని నా జీవిత అనుభవం. ఇది తెలుసుకొని కొద్దిసంవత్సరాలే అయ్యింది. కానీ ఈ అలవాటు చేసుకోవడం వల్ల చాలానే విషయాలు తెలుసుకుంటున్నాను. ( ఎందుకో, ఎలాగో అన్నది వివరముగా మరొకసారి వ్రాస్తాను. అంతలోగా మీరూ ఈ పద్ధతిని అలవాటుగా చేసుకోండి. చేసుకుంటారు కదూ.. )

ఈసారి మౌలాలి Moulali వైపుగా పని ఉండి వెళ్ళాను. ప్రొద్దున నుండీ సాయంత్రం వరకూ అక్కడే పని. బోర్ వస్తే - మధ్య మధ్యలో అక్కడున్న షాప్స్ లలో షాపింగ్ చేస్తూ పోయాను. అలా సాయంత్రం వరకూ గడిపేశాను. ఒక షాప్ లో నాకు ఎదురైన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిజానికిది చాలా మామూలు విషయమైనా - నాకు కాస్త ప్రేరణని ఇచ్చింది. కొన్ని భవిష్యత్ ఆలోచనలు ఆ దిశగా సాగాయి.

ఎదురయ్యే ప్రతివారి దగ్గర ఏదోకటి మనం నేర్చుకోనేదో, మనకు ప్రేరణనిచ్చేదో ఉండే ఉంటుంది అని ఒక మహానుభావుడు సెలవిచ్చారు. ఎవరి వద్దైనా మాటల్లో ఏదో ఒకటి తట్టవచ్చు. మనకున్న ఆలోచనలని మరికాస్త ముందుకు తీసుకెళ్ళే విధముగా ఆ ఒకటీ ఉండొచ్చు..

సరే.. ఆవిషయాల్ని ప్రక్కన పెట్టి, జరిగింది చూద్దాం.

మొబైల్ హెడ్ ఫోన్స్ కోసం ఒక మొబైల్ షాప్ లోకి వెళ్ళాను. ఒక పెద్దమనిషి కౌంటర్ మీదున్నారు.. తప్ప మరెవరూ లేరు ఆ మధ్యాహ్న వేళ. నాకు కావాల్సింది అడిగాను. చూపించారు. మూడు హెడ్ ఫోన్స్ చూశాను.. కానీ అవి టెక్నికల్ గా అంత బాగా లేకుండి, బాస్ బూస్ట్ లో శబ్దం రావటం లేదు. ఎంత బాగా ఉన్న పాట పెట్టినా అంతే. వద్దని సున్నితముగా చెప్పి, తనకూ ఆ హెడ్ ఫోన్స్ తగిలించి వినిపించాను. నిజానికి అలా హెడ్ ఫోన్స్ ద్వారా పాటల్ని వినడం అదే తొలిసారట. నేను ఆశ్చర్య పోయాను.

" నాకేమీ తెలీదు.. అంతా మా అబ్బాయి చూసుకుంటాడు. వాడికే తెలుసు. వాడు జాబ్ చేస్తుంటాడు. తీరిక వేళల్లో ఈ షాప్ చూసుకుంటాడు. నేను రిటైర్డ్ ఎంప్లాయిని. ఇప్పుడు నాకు 74 సంవత్సరాలు. ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ వస్తుందని ఇది పెట్టుకున్నాను. నాకేమో ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు. అందుకే ఈ షాప్. మొత్తం ముగ్గురం కలిసి ఈ షాప్ చూసుకుంటాం. ప్రొద్దున 8 నుండి రాత్రి 10 వరకూ షాప్ ఉంటుంది. నేనూ, మా అమ్మాయి, అబ్బాయి. ఒకరి తరవాత ఒకరుంటాం. లేకుంటే ఈ షాప్ ఖర్చు వెళ్ళుతుందా? " అన్నారు.

ఎంత షాప్ ఖర్చు అన్నాను.. ఏదో ఒకటి మాట్లాడాలని.

" స్వంత షాప్ కాదు. అద్దె షాప్. నెలకు 7,700 అద్దె.. " అన్నారు.

" మరి అంతగా సంపాదిస్తున్నారా?.." అన్నాను.. ( అలా అన్నాక నాకే ఏదోలా అనిపించింది.. మరీ పర్సనల్ వి అడుగుతున్నానేమో అనీ.. )

" హా..! రోజువారీ మొబైల్ రీచార్జ్, డాటా 30, 000 రూపాయలు ఉంటుంది. అందులో 2% వస్తుంది. అంటే రోజూ 600 రూపాయలు ఆదాయం. నెలకు 18,000 ( 600 x 30 రోజులు ). ఖర్చులు పోగా నెలకు పదివేలు మిగులుతాయి " అన్నారు.

షాప్ ని పరిశీలనగా చూశాను. పదీ X పది అడుగుల షాప్ అది. L టైపు కౌంటర్ + ర్యాక్స్ కి అరవై, డెబ్బై వేలు ఖర్చు కావచ్చు. మామూలుగా సింపుల్ గా ఉంది. అమ్మే మొబైల్ అస్సోస్సరీస్ ( ఉపకరణాలు ) అన్నీ కలిపి ఒక పదివేల రూపాయలు ఉండొచ్చు. ఆ మాత్రం పెట్టుబడికి అంత లాభం అంటే చాలా బాగున్నట్టే కదా.. ఇంతకన్నా మించి వ్యాపారాలున్నా అవిక్కడ అప్రస్తుతం.

నేనిక్కడ నేర్చుకున్న విషయాలు.. 

1. చిన్న పెట్టుబడి పెట్టి - చెప్పుకోదగ్గ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.
2. ఖాళీగా ఉండకుండా - గౌరవముగా ఉంటూ, బోర్ ని తొలగించుకోవచ్చు.
3. ప్రక్కనే మరిన్ని చిన్న చిన్న వస్తువులు అమ్మితే మరింత లాభదాయకం.
4. వయస్సు అయిపోయిందని అనుకుంటే మరిన్ని సమస్యలు. 74 సంవత్సరాలు అని ఖాళీగా ఉండక ఏదోకటి పెట్టుకొని ఉండటం భలేగా నచ్చింది నాకు.
5. ఆ వయస్సులో మరొకరి మీద ఆధారపడకుండా, తన కోసం తను సంపాదించుకోవడం - చాలా గొప్పగా అనిపించింది.
6. నామమాత్ర పెట్టుబడితో ( బ్యాలన్స్ కంపనీ డీలర్ వారే ఇస్తారు.. ఆ డాటా, మొబైల్ రీచార్జ్ అమ్మి, సాయంత్రం న ఆ కంపనీ డీలర్ వారికి డబ్బులు కట్టాలి ) ఆ మాత్రం ఆదాయం చాలా గొప్పదే కదా..


No comments:

Related Posts with Thumbnails