Friday, May 8, 2015

Good Morning - 581


ఆశావాది సమస్యలో జవాబుని ఎదుర్కుంటాడు. 
నిరాశావాది ప్రతి జవాబులోనూ సమస్యలని ఏకరువు పెడతాడు.. 

ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి మనుగడలో ఎన్నెన్నో సమస్యలను ఎదురుక్కోవాల్సి వస్తుంది. అలాగే మనిషీ తన జీవన యాత్రలో భాగముగా, ఎన్నో అనునిత్యం ఎన్నెన్నో సమస్యలను  ఎదురుకోవాల్సి వస్తుంది. ఈ ఎదురుకొనే శక్తి అనేది అందరికీ ఒకేలా ఉండదు.. కొందరికి బాగా, మరికొందరికి చాలా తక్కువగానూ ఉంటుంది. చాలామందికి అయితే - పరిస్థితుల ప్రభావం వలన, ఎదురుకొనే సమస్యలను బట్టి అలాంటి సమస్యలను ఎదుర్కొనే శక్తీ, తెలివీ అబ్బుతాయి. ఇది వారిని వారే అప్ గ్రేడ్ చేసుకోవడం లాంటిది. 

సమస్యలను ఎదుర్కోవడంలో ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రవర్తిస్తారు.. ఆలోచిస్తారు.. ఎదురుకుంటారు.. పరిష్కరిస్తారు.. అంతిమ విజయం / వైఫల్యం పొందుతారు. నిరాశావాది అనేవాడు సమస్యని పెద్దకొండలా, కొరకరాని కొయ్యలా, మింగుడు పడని విషయంగా భావిస్తాడు. అందుకే సమస్యని పరిష్కరించక, ఏవేవో అర్థంలేని సాకులు చెబుతూ, చేస్తే తప్పక ఓటమిని చవిచూస్తాం అని ఆ సమస్యని ఎదుర్కోక చతికిలపడి, నిరాశా, నిస్పృహలలో లోతుగా మునిగిపోయి ఉంటాడు. ఇలా ఉంటాడు కాబట్టే నిరాశావాది ( నిరాశతో వాదించేవాడు ) అన్నారు కాబోలు. ఇలా ఉండే వారితో ఉంటే - ఆర్నెల్లు సహవాసం చేస్తే - వారు వీర అవుతారు, వీరు వారవుతారు - అనే సామెతలా వారి ఆలోచనా తీరు మనమీద బాగా ప్రభావం చూపిస్తుంది. మనమూ నెమనెమ్మదిగా వారిలా మారిపోతాం. తస్మాత్ జాగ్రత్త.. అలా మీచుట్టూ ఉన్న సమూహంలో ఎవరైనా ఉంటే వారిని ముందుగా మార్చే ప్రయత్నం చెయ్యండి. అన్నట్లు ఇలాంటివారు మన సమూహంలో ఉంటే ఒక లాభం కూడా ఉందండోయ్.. ఏదైనా పని, ప్లాన్, ఆలోచన గానీ చేస్తుంటే - వారు అందులో ఉన్న సమస్యలన్నీ ''వారి తెలివితో'' పసిగట్టి, నిరాశతో అవేమిటో చెబుతారు. కానీ ఆ విషయాలని వారితో వాదించక - వాటిని ఎలా ఎదురుక్కోవాలో ఆశావాదులతో చర్చించాలి. అప్పుడు ఆ సమస్యలో ఉన్న జవాబును తెలుసుకుంటాం. 

ఆశావాదులు మాత్రం తాము ఎదుర్కోబోయే ప్రతి సమస్యలో  జవాబుని వెదుకుతారు. నిజానికి ప్రతి సమస్యలో సగం పరిష్కారం ఉంటుంది. ఉదాహరణకి : నేను ఈ పరీక్ష ఎలా పాస్ అవ్వాలి ? అని అనుకుంటే ఆ పరీక్షకి ఏమి చేస్తే ఆ పరీక్ష అనే సమస్యని అధిగమించగలం అని తెలుసుకొని, ఆ దిశగా గట్టి ప్రయత్నం చెయ్యాలి. ఇలా ప్రతీ సమస్యని - ఆ సమస్యని దాటగలిగేట్లుగా ఒక చక్కని పరిష్కారాన్ని ఆలోచించగలిగేవాడే ఆశావాది. ఇందుకోసం ఒక్కోసారి ధైర్యముగా ఎదురోడ్డాల్సి ఉంటుంది.. లేదా తగ్గాల్సివస్తుంది. నా దృష్టిలో -
తక్కువ సమయంలో, తక్కువ ఖర్చులో, తక్కువ నష్టంతో -  ఎక్కువ ఫలితాన్ని పొందేవాడే అసలైన వీరుడు. అలాంటివారే జీవితాన్ని వారు అనుకున్నట్లు పొందుతారు. కానీ,ఈరోజుల్లో సమస్యలని మరింత జటిలం చేసుకొనేవారు ఎక్కువయ్యారు. చిన్న చిన్న విషయాలకే లేనిపోని ఆహాలకు పోయి, పట్టింపులవల్ల మరింతగా సమస్యలను ఇబ్బందికరంగా  చేసుకుంటున్నారు.. 



No comments:

Related Posts with Thumbnails