Monday, January 13, 2014

Good Morning - 539


ఎందరిలో ఉన్నా - నీ సవ్వడే వినిపిస్తుంది. 
పనిలో నిమగ్నమైనా - నీతో మాట్లాడాలనిపిస్తుంది.. 
ఓపిక లేకున్నా - నిన్ను కలవాలనిపిస్తుంది.
ఇంతవరకు నిన్ను చూడకున్నా - 
నీతో ఏడు అడుగులు నడవాలనిపిస్తుంది.. 

అని ప్రేమికులకి ఉంటుంది. అలా అనిపించాలీ అంటే అవతలివారి హృదయంతో వారి హృదయాన్ని మమేకమై ( సింక్ / మింగిల్ ) పోయినప్పుడే అలా ఉంటుంది. నిజానికి ప్రేమ అన్నది చాలా గొప్ప ఫీలింగ్. మనల్ని మనకు కాకుండా చేస్తుంది. ఏదో తెలీని ఆరాటం.. బాధ.. విరహం.. తలపులు.. ఓహ్! 

Sunday, January 12, 2014

Good Morning - 538


దేశము మార్చేనూ.. 
భాషను మార్చేనూ, 
మోసము నేర్చెను, 
అసలు తానే మారెనూ..
అయినా మనిషి మారలేదు.. 
అతని మమత తీరలేదు.. 

అన్న సినిమాపాట నిజమే.. ఆరోజుల్లోనే కాదు ఈరోజుల్లో కూడా మనిషి ఎన్నడూ అంతర్గతముగా మారలేదు.. పైకి ఎన్ని మార్చినా - ఊరు మార్చినా, దేశాన్ని మార్చినా, వాడే భాష మార్చినా, ఎన్ని వెధవ్వేశాలు, మోసాలు నేర్చినా, టోటల్ గా తను పూర్తిగా మారినా అంత పైకే.. లోపల మాత్రం ఇంకా అలాగే ఉంది. అది మంచే కానీ, చెడే కానీ.. అంతా పైపై మెరుగులే. లోపల వారి వ్యక్తిత్వాలు మాత్రం మారలేదు.. ఇంకా అలాగే ఉన్నాయి. చిన్న చిన్న పదాల్లో ఎంత అర్థం ఉంది కదూ.. 


Saturday, January 11, 2014

Vaikunta Ekadashi Greetings


మీకూ, 
మీ మిత్రులకూ, 
కుటుంబ సభ్యులకూ, 
శ్రేయోభిలాషులకూ,, 
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. 

Friday, January 10, 2014

Good Morning - 537


బంధాలను, అనుబంధాలను స్వార్థం కోసం వాడుకొంటే - మనతోడు ఎవరూ మిగలరు. 

Thursday, January 9, 2014

Good Morning - 536


" మనంతట మనం పని చెయ్యం, 
పనిచేసేవారిని పని చెయ్యనివ్వం, 
వారిని విమర్శించి తప్పులెంచి అవహేళన చేస్తాం. 
మానవజాతి పతనానికి ముఖ్యమైనది ఈ లక్షణమే.." 
- స్వామి వివేకానంద. 

అవును.. మనం మనంతట మన పని చెయ్యం, అప్పగించిన పనీ చెయ్యం. జీతానికి మన సేవలని చెయ్యమన్నా ఇష్టంగా చేయం. ఏదో ఉదారస్వభావముగా చేస్తున్నట్లు ఫీలయ్యి, చేస్తుంటాం. ఎవరో మీద ఉండి, అంకుశం లా మాటిమాటికీ గుర్తుచేస్తుంటే - లోలోన విసుక్కుంటూ పని చేస్తుంటాం. మన విషయం అలా ఉందనీ.. ప్రక్కన ఎవరో బుద్ధిగా వారిపని వారు చేసుకుంటూ ఉంటే - వారిని ఆ పని చెయ్యనీయకుండా - ఊబుసుపోక కబుర్లు ఎన్నెన్నో చెబుతాం. మనలాగే పని ఎగ్గొట్టడానికి, ఎలా ఎగ్గోట్టాలో, అబద్ధాలు ఎలా చెప్పాలో , చచ్చిపోయిన నానమ్మని ఎన్నిసార్లు ఎలా వాడుకోవాలో.. ఉపదేశాలు ఇస్తుంటాం. వారతంట వారు పనిచేసుకొనే వారి మీద ఏదేదో విమర్శలు గుప్పిస్తాం.. పనా పాటా.. పెళ్ళాం గయ్యాళిది, పని రాక్షసుడు, ముసలినాకొడుకు, ఫోజులు కొడుతున్నాడు.. అంటూ ఏదేదో ప్రేలుతుంటాం. తా చెడిన కోతి వనమెల్లా చెడింది అన్న సామెతలా చుట్టూ ఉన్న వారినీ కలుషితం చేస్తాం. ఇదిగో ఇలాంటి ప్రవర్తననే సమస్త మానవజాతి యొక్క పతనానికి మూలకారణం. ఇలాంటివారి చుట్టూ చేరిన వారి భవిష్యత్తు అగమ్యగోచరమే. 

ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి. ఇలా ఉంటే ఎవరూ ఏమీ అనరు. అందరూ అన్నీ గమనిస్తుంటారు. హితువులు చెప్పే వారు కరువయ్యారు. వినేవారు మరీ అరుదయ్యారు. సగం జీవితం నాశనమయ్యాక అప్పుడుగానీ తెలీదు. అప్పుడు తెలిసినా ఏమీ చెయ్యలేం.. 


Wednesday, January 8, 2014

Good Morning - 535


మనం కలవాలి అనుకున్న వ్యక్తి కన్నా ముందు కొద్దిమంది తప్పుడు వ్యక్తులను కలుస్తాం.. చివరకు మనం అనుకున్న వ్యక్తిని కలిశాక, ఎంత గొప్ప కానుకని ఆ దేవుడు మనకిచ్చాడు అని అనుకుంటాం. 

మనం కలవాలీ అనుకున్న వ్యక్తి కన్నా ముందు వేరేవారిని కలుస్తాం.. ఆ తరవాతే అసలువారిని - అంటే మనం కలవాలీ అనుకున్న వారిని కలుస్తాం. ఇలా నిజజీవితములో ఒక వ్యక్తిని కలిసేటప్పుడే కాదు.. మన జీవితాన ఒక స్నేహితుడు, సోల్ మేట్.. అప్పుడు కూడా.. చివరకు మనం అనుకున్న వ్యక్తిని అలా కలిశాక, వారిలో మనం అనుకున్న గుణగణాలు ఉన్నాక, దేవుడు మనకి ఎంత గొప్ప కానుకని ఇచ్చాడు అని తప్పనిసరిగా అనుకుంటాం.. 

ఇలా నేనూ అనుకున్నాను.. ఇలా నా జీవితములో ఇద్దరున్నారు. ఆ ఇద్దరూ నేను అనుకున్నట్టే ఉన్నారు. అప్పుడు నేనూ ఆ దేవుడు నాకు ఎంత గొప్ప కానుకల్ని ఇచ్చాడు.. అనుకున్నాను. అనుకుంటూనే ఉన్నాను కూడా.. 

Tuesday, January 7, 2014

Good Morning - 534


మనిషి పుట్టినప్పుడు పేపర్ మిల్లులోంచి బయటకి వచ్చిన తెల్ల కాగితం మాదిరిగానే - ఏ మచ్చా, మరకా లేకుండా శుభ్రముగా ఉంటాడు. పెరిగే కొద్దీ పరిసరాల, పరిస్థితుల ప్రభావం అతనిపై పనిచేస్తాయి. విషయ జ్ఞానం, లోక జ్ఞానం పేరుతో నీతి, దైవం, ధర్మం, జ్ఞానం, మర్యాద, బాధ్యతల పేరుతో తల్లితండ్రులూ, ఉపాధ్యాయులు, మతం, గురువులు కలిసి, ఆ కాగితాన్ని చేయగలిగినంత మురికి చేస్తారు. ఆ కాగితమెంత ఎక్కువ మురికిగా ఉంటే అంత గొప్పగా చెలామణవుతుంది. 

Monday, January 6, 2014

Good Morning - 533


ఒక చిన్ని చిరునవ్వు ఎందరినో మీ స్నేహితులని చేస్తుంది. కానీ క్షణికమైన కోపం ఎందరినో శత్రువులని ఇస్తుంది. కనుక మీ విలువైన జీవితాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా చిరునవ్వుతో ఆస్వాదించండి. 

ఒక ( ఆహ్లాదకర ) చిరునవ్వు మన పెదాలపై పూయిస్తే, ఆ చిరునవ్వు మనకి ఎందరినో స్నేహితులని చేస్తుంది. మీ చుట్టూ అందరూ మూగిపోతారు. అదే నవ్వుకి ఉన్న మరో ప్రత్యేకత. అలా ఉంటే ఏదో తెలీని ఆకర్షణ మన మొహములో కనిపిస్తుంది. కానీ చిరునవ్వు స్థానాన కోపాన్ని ప్రదర్శించండి. మీ చుట్టూ ఎవరూ ఉండరు. పైపెచ్చు ఆ కోపం మీకు శత్రువులని తయారుచేస్తుంది. మిగతా శరీరం మీ మారకున్నా ఈ  ఒక్క భావ వ్యక్తీకరణ వల్ల మన చుట్టూరా ఎంతగా మారిపోతుందో మీరే అర్థం చేసుకోండి. నా స్నేహితురాలిని చూశాక నేనూ చాలానే మారాను. ఇది నిజమే అని తెలుసుకొన్నాను అని చెప్పడానికి ఎలాంటి నూన్యతకి గురి కాను. మన విలువైన జీవితాన్ని, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే చిరునవ్వు ప్రదర్శిస్తూ జీవితాన్ని ఆస్వాదించండి. 

Sunday, January 5, 2014

Good Morning - 532


హృదయం అన్నది పగలటానికేనేమో..!! 
ఎంత పగిలినా కొంత మిగిలే ఉంటుంది.. 
మళ్ళీ పగలటానికేనేమో..?? 

Saturday, January 4, 2014

Good Morning - 531


మనిషి ఒకసారి ప్రేమలో పడితే ఏదైనా చేస్తాడు, ఎంతైనా చేస్తాడు.. 
త్యాగమైనా, పెళ్లైనా, చివరకి చంపతానికైనా, చావటానికైనా..
కానీ ఒకటి మాత్రం నిజం.!
ఆ మనిషి తన ప్రేమని చూపించటానికి ఇదంతా చేస్తాడు. 
నిజముగా ఒక మనిషి ప్రేమలో పడటానికి కొన్ని యుగాలు, 
కొన్ని సంవత్సరాలు అవసరం లేదేమో, ఒక్క క్షణం చాలేమో..
కంచులా ఉన్న మన హృదయాన్ని మంచులా కరిగించి 
ప్రేమలో పడేయటానికి ప్రేమ మాధుర్యాన్ని పంచటానికి.. 
నేను ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. 

Friday, January 3, 2014

Good Morning - 530


ఆపదలో ఆదుకొనేవాడే స్నేహితుడు. 

అవును.. ఆపదలోనే కాదు.. అన్నింట్లో ఆదుకొనే వాడు స్నేహితుడు. అలా ఆదుకొనే స్నేహితుడే మనకి ఉండాలి. గంగిగోవు పాలు గరిటడైనను చాలు.. కడవడైనను నేమి ఖరము ( గాడిద ) పాలు .. అన్న వేమన సూక్తి ప్రకారం - మనకి ఎంతమంది స్నేహితులున్నారు అన్నది ముఖ్యమైన విషయం కాదు.. ఎంతమంది మనతో అక్కడికీ, ఇక్కడికీ వస్తున్నారు అని కాదు. మనవాళ్ళు అనుకున్నవారు మన ఆలోచనలకి వత్తాసు పలుకుతున్నారు అన్నదీ కూడా కాదు.. ఇవన్నీ పై పై మెరుగుల స్నేహాలే. నిజానికి మనం ఆపదల్లో చిక్కుకున్నప్పుడు మనకు ధైర్యవచనాలు చెప్పి, కర్తవ్యన్మోఖుడిని చేసి, లక్ష్యం దిశగా తీస్కెళ్ళగలిగే వాడే మన స్నేహితుడు. 

ఇట్టి స్నేహితుడు మనకి ధైర్యం చెబుతాడు. 
మన కష్టాల్లో తన వంతు తోడ్పాటుని అందిస్తాడు. 
మన సంతోషాల్లో పాలుపంచుకొంటాడు. 
మన అవసరాలని ముందే గమనించి, వాటిని సమయానికి అందిస్తాడు. 
మన విజయాలని పది మంది ముందూ ప్రశంసిస్తాడు. 
మనం చేసే తప్పులని ఒంటరిగా ఉన్నప్పుడు విమర్శిస్తాడు. 
దారి తప్పి ప్రయాణిస్తుంటే ముందుండి దారి చూపిస్తాడు. 
మనం ఏదైనా తప్పు చేస్తే, మొహమాటానికి వెళ్ళి, అబద్దం చెప్పడు.. మనతో విభేదించి అయినా మనం చేసింది తప్పే అని చెబుతాడు. 
లక్ష్యానికి దూరముగా జరిగినప్పుడు, మందలించి లక్ష్య దిశగా వెళ్ళేలా చేస్తాడు. 
మీ మిత్రుల్లో ఎవరు మీకు సన్నిహితులో, ఎవరు మీకు వెన్నుపోటుదారులో చెబుతాడు. 
మీకు వచ్చే ఆపదలని మీకంటే ముందే ఎదురుకుంటాడు..

....... ఇలా చేసేవాడే మీ అసలైన మిత్రుడు. అంతే కానీ, కాకమ్మ కబుర్లు, ఏది చెప్పినా జై  / తాన తందానా అంటూ  వంతపాడే స్నేహితులు మన మిత్రుల్లో ఉంటే వారికి దూరముగా ఉండటం మంచిది. 

Thursday, January 2, 2014

Good Morning - 529


సృష్టిలో అత్యంత తీయనైన అనుబంధం స్నేహం. 
తీపినే కాదు చేదుని కూడా కూడా పంచుకునేది స్నేహం. 
సంతోషంలో నీతో చేతులు కలిపి, 
బాధలో నిన్ను తన చేతుల్లోకి తీసుకొని..
నిన్ను బాధ్యతల నుండి మరలిపోకుండా 
నీ వెంటే ఉంటూ నిన్ను వెన్ను తట్టి నడిపించేది - స్నేహం. 

ఈ సృష్టిలో అత్యంత తీయనైన భావనలల్లో స్నేహం ఒకటి. చక్కని, ఎల్లకాలం తోడూ - నీడై, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ తోడు ఉండే చక్కని అనుబంధమే స్నేహం. ఈ స్నేహం కూడా మధురమైన తీపినే కాదు, వెగటు పుట్టించే చేదుని కూడా పంచుతుంది. నేటిరోజుల్లో చాలా వరకు అవసరార్థ స్నేహాలే. మంచి, ప్రోత్సాహాన్నిచ్చే, కష్టాల్లో పాలుపంచుకొనే స్నేహాలు మరీ అరుదయ్యాయి. మన సంతోషాల్లో చేతులు కలిపి ఆ సంతోషాల్లో ఆనందిస్తూ, మనం బాధల్లో ఉన్నప్పుడు దగ్గరకు తీసుకొని, ఓదార్చేదే అసలైన స్నేహం. మనల్ని బాధ్యతల నుండి వేరేవైపు దృష్టి పోనీవకుండా, సరియైన దారిలో నడిచేలా, నీ వెంటే ఉంటూ, నీ వెన్ను తట్టి, మనల్ని ముందు నడిపించేదే అసలైన స్నేహం. అలాంటి స్నేహం మీకే గనుక ఉంటే - వారిని ద య చే సి ఎన్నటికీ దూరం చేసుకోకండి. 

నాకూ ఇలాంటి స్నేహాలు కొన్ని ఉన్నాయి. వాటి వల్ల చాలా మధురాతి మధుర అనుభూతులు ఉన్నాయి. వాటి గురించీ వీలు వెంబడి చెబుతాను. 

Wednesday, January 1, 2014

Good Morning - 528


నిజమైన మితృలు ఒకరిని విడిచి, ఒకరు వదిలి వెళ్ళిపోరు. ఒకవేళ వెళ్ళిపోయినా అది తాత్కాలికమే! కొన్నిసార్లు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మాట్లాడకుండా మౌనముగా దూరముగా ఉంటారు. కానీ వారి మనస్సుల్లో - ఎదుటివారు ఏమి చేస్తున్నారో, వారు ఎలా ఉన్నారో, అంతా క్షేమమేనా ?.. అన్న ఆలోచనలే..!

నిజమైన మిత్రులు అంటే అంతేగా మరి.. పైన చెప్పినది అక్షరాల సత్యమే.. ఒకరిని విడిచి మరొకరు వెళ్ళిపోరు. అలా వెళ్ళిపోవాల్సి వస్తే ఏవో చాలా బలమైన కారణాలే ఉండి ఉంటాయి. ఒకవేళ వెళ్ళిపోయినా అది శాశ్వతమైన ఎడబాటు కానేకాదు. కొద్దికాలమే అలా ఉంటారు. ఆ సమయాన ఎప్పుడు వారు కనిపిస్తారా? ఎప్పుడు తిరిగి మాట్లాడుదామా ?.. అన్నట్లుగా ఉంటారు. ఏదో తెలీని బెట్టు వల్ల అలా దూరముండాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వారి మనసులు మాత్రం ఎప్పుడూ ఒకరి బాగోగుల కోసం, యోగక్షేమాల గురించే ప్రాకులాడుతాయి. 

స్నేహితులన్నాక - కొన్నిసార్లు తిట్టుకుంటారు.. కొట్టుకుంటారు.. ఒకరి మీద మరొకరు ఫిర్యాదు చేసుకుంటారు. అవన్నీ పైపైన ఉండే పటాటోపాలే.. టీ కప్పులో తుఫాన్ లా చప్పున చల్లారిపోతాయి. మళ్ళీ ఎప్పటిలా అనురాగాలూ, ఆప్యాయతలూ కొనసాగుతుంటాయి. అదే స్నేహమంటే. స్నేహమంటే అలాగే కొనసాగుతూ ఉంటూనే ఉంటుంది. కొన్నిసార్లు ఒకరినొకరు మాట్లాకుండా, మౌనముగా కనీసం మాటలకు అందకుండా దూరముగా ఉంటారు. కానీ వారి మనస్సులలో - తను ఏమి చేస్తున్నారో, ఎలా ఉన్నారో, ఈ సమయాన వారేమి చేస్తున్నారో.. ఫలానా రోజున ఈ సమయాన ఇలాంటి సందర్భాన ఇలా అన్నారు కదా.. అంటూ వారిని పదే పదే గుర్తుచేసుకుంటూనే ఉంటారు. 

ఇలాంటి అనుభవం నాకూ జరిగింది. అది నాకు చాలా అందమైన, మధురమైన బాధగా ( హా నిజమే!.. పద ప్రయోగం సరియైనదే ) మిగిలిపోయింది. ఎప్పుడూ పైన చెప్పినట్లే నా ప్రమేయం లేకుండానే అలా ప్రవర్తించాను. 

Related Posts with Thumbnails