Saturday, November 9, 2013

Good Morning - 492


మనం సంతోషముగా ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని పంచుకోవడానికి ఒక నిండు హృదయం కావాలి.. మనం బాధపడుతున్నప్పుడు మనం వాలడానికి ఒక భుజం కావాలి.. అప్పుడే జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది.. 

మనకి సంతోషం వచ్చినప్పుడో, విజయం సాధించినప్పుడో ఆ తాలూకు ఆనందాన్ని ఎందరిలో ప్రకటించుకున్నా, మనకు బాగా నచ్చిన వారి దగ్గర పంచుకోవటానికి ఎంతో ఉత్సుకత చూపిస్తాం. ఆ భావన తాలూకు సంతోషాన్ని పెద్దమనసుతో విని, అర్థం చేసుకొనే హృదయం ఉన్న ఆత్మీయుల పట్ల అమితాసక్తిని చూపిస్తాం. వారు చెప్పే, చూపించే చిన్న ఆనంద భావ ప్రకటన కోసం వెంపర్లాడుతాం. 

మనం బాధపడుతున్నప్పుడు - ఆ బాధని పంచుకోవడానికి ఒక తోడు ఉంటే బాగుండును అని అనిపిస్తుంది. నిజం చెప్పాలీ అంటే మనసుకి బాగా నచ్చిన ఆత్మీయ నేస్తమే కావొచ్చును.. తోడబుట్టిన బంధమే కావొచ్చును.. లేదా తల్లితండ్రులే కావొచ్చును. ఎవరైనా సరే - వారిపట్ల అచంచల నమ్మకం, ఎవరికీ ఏదీ తిరిగి చెప్పరు, ఆ విషయాన్ని వారిలోనే దాచేసుకుంటారు - అన్న నమ్మకం కలిగించేవారి భుజం మీదనో, ఒడిలో వాలి తనివితీరా బాధపడాలని, వారి గట్టిగా కౌగిలించుకొని - మన దుఃఖాన్ని వారితో పంచుకోవాలని అనుకుంటాం. బేలగా, గాయపడిన హృదయాన్ని సేదదీర్చి, ఆ విషయములో మనం ఎక్కడ పొరబాట్లు చేశామో, ఎలా సరిదిద్దుకోవాలో చెప్పేవారు మనకి ఉంటే, మరీ వారి సన్నిహిత్యాన్నే కోరుకుంటాం. అలాంటివారు దొరకడం మన అదృష్టమే అనుకోవాలి. 

అలా దొరికిననాడు, అలా సంతోషమొచ్చినా, బాధ వచ్చినా పంచుకోవడానికి ఒక ఆత్మీయ హృదయం ఉంటే - ఇక ఆ జీవితానికి అర్థం, పరమార్థం ఇంకా ఏముంటుంది..? అంతకన్నా అదృష్టం ఏముందీ..

No comments:

Related Posts with Thumbnails