Thursday, May 31, 2012

Good Morning - 99


Wednesday, May 30, 2012

Facebook - Comment re-editing

ఫేస్ బుక్ లో ఒక కామెంట్ వ్రాసి పోస్ట్ చేశాక, వెంటనే ఆ కామెంట్ లో ఏదైనా మార్పు చెయ్యాలనిపించిందా?.. లేదా ఆ కామెంట్ అలా వ్రాయక వేరేలాగా వ్రాయాలని ఉందా..? లేదా అర్రెర్రె.. ఇలా వ్రాశానేమిటీ?.. అని సరిదిద్దాలని అనుకుంటున్నారా?.. ఫరవాలేదు. మీరు వెంటనే ఆ పోస్ట్ చేసిన కామెంట్ బాక్స్ కుడి వైపు మూలన ఉన్న రిమూవ్ బటన్ ని నొక్కండి. ఇది X గుర్తుతో ఉంటుంది. ఆ మూలన మౌస్ తో కర్సర్ ని అక్కడ పెడితే గానీ కనిపించదు. అలా కర్సర్ ని పెట్టగానే ఇలా ఈ క్రింది ఉదాహరణ లోలా కనిపిస్తుంది. 

అలా కనిపించాక దాన్ని వెంటనే నొక్కండి. అప్పుడు ఈ క్రింది దానిలా మళ్ళీ ఎడిట్ చేసేలా వీలుగా కనిపిస్తుంది. 

అప్పుడు మీరు మళ్ళీ ఎడిట్ చేసి, మార్పులు ఏమైనా ఉంటే చేసి, మళ్ళీ పోస్ట్ చేసెయ్యండి అంటే ఎంటర్ బటన్ ని నొక్కటమే. చాలా సింపుల్ గా ఉంది కదూ.. 

ఇక్కడ ముఖ్యమైన విషయం : అలా ఆ కామెంట్ ని ఎడిటింగ్ కోసం మళ్ళీ తెరవటానికి రెండు మూడు సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. కాసింత ఆలస్యం చేస్తే తెరుచుకోదు. అప్పుడు డిలీట్ చేసి, మళ్ళీ వ్రాయటం తప్పదు.  

Saturday, May 19, 2012

If A shop sells chocolates Re.1 each..


If A shop sells chocolates Re.1 each you can exchange 3 wrappers for 1 choclate if you have Rs 15 how many choclates can you totally get?

ఒక షాప్ అతను ఒక రూపాయకి ఒక చాకొలేట్ చొప్పున అమ్ముతున్నాడు. అలాగే మూడు చాకొలేట్స్ కవర్లని తిరిగి తనకి ఇస్తే, ఒక చాకొలేట్ ఉచితముగా మార్చి ఇస్తున్నాడు. మీ దగ్గర 15 రూపాయలు ఉంటే - మీ దగ్గర ఎన్ని చాకొలేట్స్ ఉంటాయి. ?
జవాబు చెప్పండి. లేదా రేపు (ఆదివారం) ఉదయాన అప్డేట్ చూడండి. 

ఇప్పుడు జవాబు చూద్దాం. 

ముందుగా తన దగ్గర ఉన్న పదిహేను రూపాయలతో, రూపాయకి ఒకటి చొప్పున చాకలేట్స్ కొంటే, పదిహేను (15) చాకలేట్స్ వస్తాయి. ఆ పదిహేను వాటి కవర్స్ ని తీసి, మార్పిడి చేస్తే - మూడింటి కవర్స్ కి ఒకటి చొప్పున అవొక ఐదు (5) చాకలేట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు మొత్తం ఇరవై అయ్యాయి. ఇప్పుడు ఆ వచ్చిన ఐదు చాకలేట్స్ లలో మూడింటి కవర్స్ ని మారిస్తే, ఒక చాకలేట్ (1) వస్తుంది. ఆ వచ్చిన చాకలేట్ కవర్ ని, మిగిలిన రెండు చాకొలేట్ కవర్లు కలిపి మూడు కవర్లు అవుతాయి. వీటిని మారిస్తే ఇంకో చాకలేట్ (1) వస్తుంది. అంటే మొత్తం (22) అన్నమాట. 

సరిగ్గా జవాబు చెప్పిన విజేతలిద్దరికీ అభినందనలు..

Monday, May 14, 2012

క్యారీ బ్యాగులు

ఈ మధ్య మార్కెట్లలో ఇచ్చే నల్లని, తెల్లని, నీలి రంగుల్లో ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని చూశారా.. కూరగాయల కొట్లల్లో, హోటల్స్ లలో, కిరాణా దుకాణాలలోనే కాక ఎన్నో చోట్ల ఉచితముగా ఇచ్చే ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని ఒకసారి పరిశీలించండి.. మన ఆరోగ్యాలతో ఎంత దారుణముగా అడుకుంటున్నారో మీకే అర్థమవుతుంది.

ఇరవై మైక్రాన్ల మందం లోపు ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని ప్రభుత్వ నిషేధం తరవాత, నిషేధం మాటేమితో గానీ, ఎక్కడ చూసినా ఈ ఇరవై మైక్రాన్ల మందము లోపే క్యారీ బ్యాగులు కనిపిస్తున్నాయి, వాడకములోకి వచ్చేస్తున్నాయి కూడా. నిషేధము ముందే కాసింత నయం. జెన్యూన్ ప్లాస్టిక్ తో చేసిన తెల్లని ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని ఇచ్చేవారు. ఇప్పుడు అవి పూర్తిగా మార్కెట్ నుండి మాయం అయ్యి, ఈ బ్యాగులు బయలుదేరాయి. ఎక్కడ చూసినా ఇవే.

ఇప్పుడు మార్కెట్లలో ఇస్తున్న ఈ క్యారీ బ్యాగులని ఒకసారి పరిశీలిద్దాం. మొదట్లో తెల్లని రంగులో / పారదర్శకమైన క్యారీ బ్యాగులు మార్కెట్లో లభ్యం అవుతుండేటివి. నల్ల రంగు క్యారీ బ్యాగులు చాలా తక్కువగా వాడేవారు. నిషేధం తరవాత తెల్లని రంగులోనివి, మార్కెట్ నుండి పూర్తిగా మాయం అయ్యాయి. నల్లని కవర్లలో కూడా జెన్యూన్ ప్లాస్టిక్ నుండి తయారయిన బ్యాగుల స్థానాన, రిసైకిల్డ్ ప్లాస్టిక్ నుండి చేసిన ప్లాస్టిక్ బ్యాగులు రావటం మొదలయ్యాయి. ఇవి బాగుండటం లేదని అంటున్నారని, కాసింత సాంకేతికత పొంది, అదే రిసైకిల్డ్ ప్లాస్టిక్ తో తయారయిన అసంపూర్ణ పారదర్శకత ఉన్న తెలుపు, నీలిరంగు కవర్లు తయారుచేసి, ఇస్తున్నారు. ఈ రంగు కవర్లని చూసి ఒరిజినల్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులనే అనుకుంటాము. కాని తరవాత కాదని తెలుసుకొని, మోసపోతాం.

ఈ ప్లాస్టిక్ కవర్లని ఒకసారి ఓపెన్ చేసి, వాసన చూడండి. మీకు డోకు రావటం ఖాయం. అందులోని ఆహార పదార్థాలని ఇక ఎలా తినగలం? ఆహారపదార్థాలు అయిన పళ్ళు, టిఫినీలు, కేకులు, బిస్కట్స్ ని రెండు భాగాలు చేసి, వీటిల్లో ఒక భాగం పెట్టి కాసేపటి తరవాత తిని చూడండి. అలాగే అందులో పెట్టకుండా బయట పెట్టిన భాగాన్ని కూడా రుచి చూడండి. ఎంత తేడా కనిపిస్తుందో చూడండి. అంతా ఏదో మురికి వాసన వస్తున్నట్లుగా ఉంటుంది చూడండి. 

అలా వాసన వస్తున్న కవర్లని మార్కెట్లో ఎలా అమ్మనిస్తున్నారో, ఎలా వారు మనకి ఇస్తున్నారో, మనం కూడా అసలు వాటి గురించి ఏమీ తెలుసుకోకుండా వాటిని వాడటం ఏమిటో.. ఏమిటో అస్సలు అర్థం కాదు. ఇందులో ఎవరిదీ తప్పు అని మీన మేషాలు లెక్కపెట్టక, దయచేసి ఆ క్యారీ బ్యాగుల్ని వాడకండి. మీ ఆరోగ్యాలని పాడు చేసుకోకండి.  

Wednesday, May 9, 2012

Full screen mode in Facebook

మీ ఫేస్ బుక్ అకౌంట్ లో మీ ఫొటోస్ కానీ, మీ స్నేహితులు అప్లోడ్ చేసిన ఫొటోస్ గానీ పెద్దగా చూడాలని అనుకుంటే ఆ ఫోటో మీద నొక్కండి. అప్పుడు మీ ఆ ఫోటో ఇలా కనిపిస్తుంది. 


ఇలా ఆ ఫోటో ఓపెన్ అయ్యాక, ఆ ఎర్ర వృత్తములో కనిపిస్తున్న చోట కర్సర్ తీసుకవస్తే, ఒక డబుల్ యారో Double Arrow కనిపిస్తుంది. దాన్ని మీద నొక్కితే, ఆ ఫోటో మీ కంప్యూటర్ మానిటర్ నిండుగా కనిపిస్తుంది. 

తరవాతి ఫోటో చూడాలంటే - ముందు, వెనక బాణం గుర్తుల కీ వాడితే, వెనక లేదా ముందు ఫొటోస్ చూస్తూ పోవచ్చును. 

అన్నీ చూశాక, లేదా అసలు అలా ఫుల్ స్క్రీన్ మోడ్ నుండి బయటకి రావాలంటే పైన స్క్రీన్ కుడి మూలన ఉన్న X ని కర్సర్ తో నొక్కితే సరి. లేదా Esc కీ నొక్కినా చాలు. 

Sunday, May 6, 2012

తన నంబర్ చెబుతారా?

ఆమధ్య ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాను. తను ఇంకో మిత్రుడిని పరిచయం చేస్తాను అని చెప్పారు. తనకోసం వెయిటింగ్ చేశాం. నా ఫ్రెండ్ లోపలి గదుల్లోకి వెళ్ళినప్పుడు - ఆ క్రొత్త ఫ్రెండ్ వచ్చాడు.

నేను, తను ఒకళ్ళని ఒకరు చూసుకోవటం అదే తొలిసారి. ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ వచ్చాడు. తను వచ్చింది చూసి, సోఫాలో కూర్చున్నవాడిని, లేచి విష్ చేశాను. హ్మ్! రెస్పాన్స్ లేదు. నా విష్ సరిగా వినపడలేదేమో అనుకున్నాను. ఫోన్ అయ్యాక కేవలం అడుగు దూరములో ఉన్న నన్ను కనీసం చూడకుండానే, భోజనానికి కూర్చున్నాడు. నా మనసులో ఏదో అనుమానం. కానీ పరిచయం ఏమీ లేదు గనుక, అలా ప్రవర్తించి ఉండొచ్చును అనుకున్నాను.

భోజనాలు చేసేటప్పుడు - నా ఫ్రెండ్ తనకి పరిచయం చేశారు. అప్పటినుండి చిన్నగా మాటలు మొదలయ్యాయి. కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు అయ్యాక, సోఫాలో చేరగిలి, కబుర్లు మొదలెట్టాం. నా విష్ కి బదులు ఇవ్వలేదు అనే విషయమే మరిచాను.

కబుర్ల మధ్యలో - అవీ, ఇవీ విషయాలు చర్చకి వచ్చాయి. ఎక్కువగా నా స్వవిషయాలు. పరిచయాల మొదట్లో అవి కామనే కదా.. అలా సాగుతున్న మా మాటల మధ్య అకస్మాత్తుగా జేబులోనుండి ఆపిల్ ఐ ఫోన్ 4S మాడల్ ఫోన్ తీసి, నాకు చూపిస్తూ, ఫోన్ లాక్ ఓపెన్ చేసి కీ ప్యాడ్ ఓపెన్ చేసి - " వారి (XYZ) ఫోన్ నంబర్ మీ దగ్గర ఉందా? తన నంబర్ చెబుతారా..? " అడిగాడు. ఆ ఆడగటం కూడా ఒక స్పెషల్ గా అడిగాడు. ఎలా అంటే - తను వచ్చేటప్పుడు రెండు ఫోన్ యూనిట్స్ పట్టుకోచ్చేశాడు. ఒకటి బయట పెట్టాడు. వచ్చేముందు ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చాడు అన్నాను కదా.. ఆ ఫోన్ తోనే. అది Wynncom డబల్ సిమ్ ఫోన్. ఫోన్ నంబర్ ని అందులో అయినా ఫీడ్ చేసుకోవచ్చును కదా.. ఏం! అందులో అలా ఫీడ్, కాల్ చేసుకోరాదా?

నేను షాక్ అయ్యాను. నిజానికి ఆ ఒకరు తనకి తెలుసు, వారి ఫోన్ నంబర్ తన దగ్గర ఉండొచ్చు, లేదా మా ఫ్రెండ్ దగ్గర మాత్రం ఖచ్చితముగా ఉంది కూడా.. తన దగ్గర తీసుకోవచ్చును కదా.! అయినా నన్ను అడగటం ఏమిటీ?. అయినా ఆ ఫ్రెండ్ అంటే వారికి గిట్టదు కూడా. ఒకప్పుడు వారి దగ్గరి ఫ్రెండ్, కొద్దినెలల తరవాత విడిపోయారు కూడా. ఆ XYZ ఫోన్ నంబర్ నా దగ్గర ఉందని నన్ను అడగటం ఎందుకూ..?

నా మొబైల్ లో ఆ నంబర్ ఉంది. ఒకే ఒకసారి ఆ నంబర్ కి కాల్ చేశాను అని నా ఫ్రెండ్ తో చెప్పాను కూడా. మళ్ళీ ఇంతవరకూ మళ్ళీ ఆ నంబర్ వాడలేదు. ఫోన్ తీయబోతూ, ఆగిపోయాను. ఎందుకో మనసు వద్దంది. ఆగిపోయాను. వెంటనే తేరుకొని " ఆ నంబర్ నా మొబైల్ లో ఫీడ్ లేదు. మెయిల్ లో ఉంది, అందులోంచి చూసి, చెయ్యాలి.." అబద్ధం చెప్పాను. ఆ ఒక్క క్షణం లోనే చాలా ప్రశ్నలు ఉదయించాయి.

తన నంబర్ ఇస్తే - ఇతడికీ, వారికీ ఇంతకు ముందే గొడవలు ఉన్నాయి. మళ్ళీ గొడవలు మొదలవటానికి, నేనే కారణం అవుతానేమో. 


ఆ నంబర్ ఇచ్చారు నాకోసం అనీ. నేనూ ఆ ఇచ్చినప్పుడు సమయం లోనే ఒకేఒకసారి కాల్ చేసి మాట్లాడాను. మళ్ళీ ఇక మీకు ఎన్నడూ కాల్ చెయ్యను. చేసేలా చెయ్యకండి. ఈ కాల్ లోనే అన్నీ అడిగేయ్యండి.. అనే కండీషన్ మీద అయితేనే మాట్లాడటానికి నేను ఒప్పుకున్నాను. వీరికేలా ఇవ్వగలను?.


ఒకవేళ ఇస్తే, అలా అలా చేతులు దాటి, తుంటరి చేష్టతో తనని ఇబ్బంది పెడితే.. చివరకి ఈ ఫోన్ నంబర్ మీకు ఎలా వచ్చింది అంటే చివరకి నా పేరు వస్తుంది. అప్పుడు నాకు ఉంటుందీ - ఒక పెద్ద తలనొప్పి. 


అయినా తన నంబర్ వారి దగ్గర ఉన్నా నన్నే అడగటం ఎందుకూ..? నా ఫ్రెండ్ కూడా ఏమీ మాట్లాడక పోయేసరికి, అలా అడగటములో వాడికీ అందులో భాగం ఉందా? 


అయినా అంతా గొడవలన్నీ ముగిసి, ప్రశాంతముగా ఉన్న సమయాన, మళ్ళీ ఆ XYZ ఫోన్ నంబర్ ఎందుకూ..? 


అయినా Wynncom డబల్ సిమ్ ఫోన్ ప్రక్కన ఉన్నా, ఆ ఆపిల్ ఐ ఫోన్ అప్పుడే తీసి, నాకు చూపిస్తూ అందులోంచి కాల్ చెయ్యాలని చూడటం ఏమిటీ? ఆ ఇంకో ఫోన్ లో బ్యాలన్స్ లేదా?.. అలా లేనప్పుడు ఆ ఐ ఫోన్ కూడా ఎందుకో! 


లేదా - నాది లేటెస్ట్ ఆపిల్ ఐ ఫోన్ స్టాండర్డ్ నాది.. చూశావా అని ఫోజా? 


అలా నంబర్ అడిగి, నీ ఫోన్ ని చూసి, నీ (ఆర్ధిక) స్టాండర్డ్ ఏమిటో చూస్తాను అనా?.. నాకు మాత్రం ఇదే కరెక్ట్ అనిపించింది. 

ఇక అర్థం అయ్యింది.. ఇక తనని మా ఫ్రెండ్ పరిచయం చేసినా - అది ఆర్ధిక అసమానతలు అనే పునాది మీద పరిచయం అయిన స్నేహం కాబట్టి, ఎక్కువ రోజులు సాగదు తెలిసిపోయింది. తనకి పరిచయం చేసిన మా ఫ్రెండ్ ఫీల్ అవుతాడని, తన కోసం అనీ, పైపైకి నటిస్తూ, వేసే జోకులకు నవ్వుతూ, బాగా క్లోజ్ అన్నట్లు ఉండిపోయాను. చాలా సంవత్సరాల తరవాత స్నేహితుల వద్ద నటించాల్సివచ్చింది. నా మనస్సుని రెండుగా చేశాను. పైకి అతనితో, ఏమీ కల్మషం లేకుండా నవ్వుతూ ఉన్నట్లు ఉన్నా, లోపల మాత్రం తను అనే మాటలు వెనక ఉన్న గోతులను, అంతరార్థాలని గమనిస్తున్నాను. ఆ సంఘటన తరవాత ఇక ఎక్కడా ఇబ్బంది పెట్టుకోలేదు. పడలేదు. చాలా కూల్ గా ఉండిపోయాను. చాలా చోట్ల ఇరుక్కునే మాటలు వచ్చాయి కానీ, నా జాగ్రత్త వల్ల ఎక్కడా వారి వలలో పడలేదు. అన్నీ తెలుస్తూనే ఉన్నాయి కదా.. తన ఆలోచనలు అన్నీ.

అలా మాట్లాడేసి, బయటకి వచ్చేశాను. ఈ విషయం నా ఫ్రెండ్ కి ఇంతవరకూ చెప్పలేదు. స్నేహ ధర్మాన్ని పాటించాలి కదా.. ఒకరి మీద చెబితే నాకు వచ్చేది ఏముందీ..? నేను అంచనా వేసినట్లే - నా మీద ఏదో చెప్పేశాడు. నానుండి దూరం అయ్యాడు. ముందే ఊహించాను కాబట్టి మామూలుగానే ఉన్నాను. ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోయినా ఏమీ బాధ లేదు.

మొత్తానికి స్థూలముగా ఆలోచిస్తే - కొన్ని విషయాలు స్పష్టం అయ్యాయి నాకు.

నంబర్ ఇస్తే - వారు ఎప్పుడైనా - తానే మాకు నంబర్ ఇచ్చాడు అని ఆ XYZ తో అంటే ఇక నా పని అవుట్. 


తనని వీరు ఏమైనా ఇబ్బంది పెడితే, ఈ గ్యాంగ్ లో ఆ (పర్సనల్) నంబర్ నాకొక్కడికే తెలుసు. కనుక ఎటొచ్చీ నేనే దొరికిపోతాను. 


ఎంత కాస్ట్లీ ఫోన్ వాడితే - అంత రిచ్ పర్సనా?.. కొద్దిరోజులకి క్రొత్త మాడల్స్ వస్తూనే ఉన్నాయి. అప్పుడు అవి ఉన్నవారే ధనవంతులా?.. 


తన నంబర్ మొబైల్ లో ఫీడ్ అయ్యి ఉంది, వీలున్నప్పుడల్లా మా ఫ్రెండ్ విషయాలు నేనే చేరేస్తున్నాను అని సాక్ష్యాధారాలతో తనముందు నన్ను దోషిగా నిలబెట్టాలనా?. 


ఇలా నీ శత్రువు ఫోన్ నంబర్ మొబైల్ లో ఫీడ్ చేసుకున్నాడు.. మా మొబైల్స్ లో ఆ నంబర్ లేదు తనతో అంటే - తన శత్రువులతో కూడా నేనే సఖ్యముగా ఉంటున్నాను అని సాక్ష్యముగా చూపటానికా? 


ఇలాంటివాడితో ఇంకా ఎలా స్నేహం ఎలా చేస్తున్నావు అని అనడానికా?.. 


పోనీ నేనే కాల్ కలిపించి ఇచ్చినా, "చూశావా! ఫోన్ నంబర్ ఎలా దాచుకున్నాడో, ఎలా కలిపి మాట్లాడనిచ్చాడో, అంటే వారిద్దరి మధ్య మాటలు కొనసాగుతున్నాయన్నమాట.. " అని సాక్ష్యముగా చూపటానికి కావచ్చును. 


లేదా మాట్లాడించినా - రాజ్ నా దగ్గర తన నంబర్ ఉంది, మాట్లాడుతారా? అని అంటే మాట్లాడుతున్నా.." అని ఆ XYZ తో అంటే - ఇక నా విలువ ఏముంటుంది. ఎలా ఆలోచించినా నిండా మునిగేది నేనే.. 

ఇలా చాలా అర్థాలు వచ్చాయి. మొత్తానికి ఆరోజు గండం దాటాను. ఆ నూతన మిత్రుడి తొందరపాటు తనం వల్ల - ఎటువంటి చిక్కులు ఎదురుకోలేదు. నేను గనక తనని నమ్మి నంబర్ చెప్పేసి ఉంటే - కథ ఇంకోలా ఉండేది. నేనే అందరి ముందు దోషిలా నిలబడేవాడిని.

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే - ఒక వ్యక్తిని కాసింత పరిశీలన చేస్తే, మనం చాలా చిక్కులనుండి ముందే బయటపడొచ్చును అనీ. తగు జాగ్రత్తలు తీసుకోవచ్చనీ.. ఎన్నెన్నో చిక్కు సమస్యల నుండి మనల్ని రక్షిస్తుంది అంటే ఒక చిన్న అబద్ధం ఆడటం తప్పులేదు. 

Tuesday, May 1, 2012

ఆ సార్ మంచోడు కాదు..

మన జీవితాల్లో చాలా చాలా విషయాలలో ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతాయి. కొన్ని అభిప్రాయాలు ఏర్పరుచుకుంటే అవి తప్పని తరవాత తెలుస్తాయి. అప్పుడు మనసంతా వికలమవుతుంది.

నేను చిన్నప్పుడు ఒక టీచర్ ఉండేవారు. తను అప్పట్లో ఎమ్మెస్సీ ఏమ్మీడీ చేసి, ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తూ, సాయంకాలాల్లో ప్రైవేటుగా ట్యూషన్స్ చెప్పేవారు. అలాగే పీహెచ్డీ కూడా చేస్తున్నారు. తన క్లాసులంటే స్కూల్ పిల్లలకి చాలా ఇష్టం. తను వాడే భాష సరళముగా, తేలికగా ఉండి, చాలా హుందాగా ఉంటాడు. అలాగే చాలా అందముగా (ఇప్పటికీ) కూడా ఉంటాడు.

అతని పాపులారిటీ మీద, మా స్నేహితుడు ఒకరు కాస్త అనుమాన వాఖ్యలు చేశాడు.. ఆ సార్ అమ్మాయిలతో బాగా చనువుగా ఉంటారనీ.. అందుకే అమ్మాయిలతో బాగా చనువుగా ఉంటారనీ.. పైగా వారికి ప్రేమలేఖలు వ్రాశారనీ.. ఇలా చాలానే చెప్పాడు. నేను నమ్మలేదు. చెప్పగా, చెప్పగా, నేనూ నమ్మాల్సి వచ్చింది. కానీ ఎక్కడో ఒక మూల కాసింత అనుమానమే! అవన్నీ నిజాలు కావనీ!. నా స్నేహితుడు నాటిన మాటల వల్ల, ఆ సార్ తో నాకున్న చాలా దగ్గరి ఆత్మీయ బంధం కూడా దూరం చేసుకున్నాను.

నేను అప్పట్లో చాల చిన్నవాడిని. హైస్కూల్ చదువు చదువుతున్నాను. ఊహ మొదలవుతున్నది అప్పుడప్పుడే. ఏది మంచో, ఏది చెడో నేర్చుకుంటున్న సమయం అది. నేనూ ఈ విషయం నా మిగతా మితృలకి చెప్పాను.

నాకు బాగా తెలిసిన అమ్మాయికి ఇదంతా చెప్పేసి, ఆ సార్ తో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాను. అలాగే మీ స్నేహితురాళ్ళనీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాను. అందులకు ఆ అమ్మాయి నాకు క్లాస్ పీకింది. " అలాంటివారు ఏమీ కాదు ఆసార్ అనీ.. నీకు ఎవడు చెప్పాడో కానీ వాడే అనుమాన పక్షి గాడు.." నన్నే క్లాస్ పీకింది. " నీ ఇష్టం.." అని ఆ టాపిక్ అక్కడితో ముగించేశాను.

కాలచక్రం గిర్రున తిరిగింది. జీవితములో చాలా ముందుకి వచ్చేశాం. మొన్న ఆ సార్ కలసి, తనే ముందుగా నన్నే పలకరించారు.. ఏమిటీ రాజ్!.. బాగున్నారా?.. అంటూ. నేను గుర్తుపట్టాను. బాగున్నారా.. అని కాసిన్ని కుశల ప్రశ్నలు అయ్యాక తను వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయారు. తానిప్పుడు జిల్లా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. (D.E.O) అయినా ఏమాత్రం దర్పం చూపక, మామూలుగా ఆత్మీయముగా మాట్లాడారు. చిన్నప్పుడు నాతో ఎలా మాట్లాడేవారో, అచ్చు అలాగే అదే టెంపోలో. మాటల్లో ఆ తీయదనం ఏమీ మారలేదు - ఎన్నో సంవత్సరాలు గడిచినా.!

నాకు అప్పుడు చిన్నప్పుడు తనమీద అన్నమాటలు గుర్తుకువచ్చాయి. నామీద నాకే సిగ్గుగా, అసహ్యముగా అనిపించింది. అప్పట్లో తనమీద చెప్పిన మాటలు అన్నీ తప్పే!. ఊహ మొదలవుతున్న తరుణాన జరిగే తప్పులు అవి. మెచ్యూరిటీ ఏమాత్రం లేని సమయం అది. అయినా నేను చేసింది తప్పే!. నేను విన్నది అంతా అబద్ధం అని కొద్ది సంవత్సరాలలోనే తెలుసుకున్నాను.

అప్పటినుండీ యే విషయానైన్నా స్వంతముగా నిర్ధారించుకున్నాకే ఇతరులకి చెప్పటం మొదలెట్టాను. ఇన్ని సంవత్సరాల్లో ఆయన నష్టపోయింది ఏమీ లేదు. జీవితాన చిన్న వయస్సులోనే ఉన్నతమైన హోదాని సంపాదించాడు. నష్టపోయింది మాత్రం నేనే!.. తన పరిచయం, మితృత్వం, సాంగత్యం.. ఇవన్నీ ఇన్ని సంవత్సరాలుగా నష్టపోయాను. చెప్పుడు మాటలు వింటే - ఏదేదో ఊహించుకోవటానికి, చెప్పటానికి బాగానే ఉంటుంది. కానీ చివరకి మనమే నష్టపోతాం అని నాకు కాలమే చక్కగా తెలియచేసింది.  
Related Posts with Thumbnails