Monday, September 12, 2011

CFL బల్బ్స్

కంపాక్ట్ ఫ్లోరోసెంట్ లాంప్ అనబడే CFL బల్బ్ మొదటగా మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఒకటి కొన్నాను. అప్పట్లో అది రెండు పుల్లల్లాగా అటాచబుల్ CFL, దానికే ఉండే కాపర్ వైండింగ్ గల మాగ్నటిక్ బల్లాస్ట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇక ప్రపంచము అంతా వీటిదే అని అప్పట్లో ఒక టాక్. ఇప్పుడూ అలాగే ఉంది లెండి. సాధారణ బల్బ్స్ ఎక్కువగా ఇప్పుడు కనిపించటం లేదు.. వాటి ఉనికి కూడా చాలా తక్కువగా కనిపిస్తూనే ఉంది కూడా.

అలా కొన్న ఆ CFL బల్బ్ చాలా రోజులు వాడాను. ఒకరోజు వోల్టేజ్ ఎక్కువగా రావటం మూలాన అన్నీ ఆఫ్ చేసి, ఇదొక్కటే వేసి ఉంచాను. ఇది వోల్టేజ్ హేచ్చుతగ్గులని తట్టుకుంటుంది అంటే అలా చేశాను. ఇది 1996 లో జరిగిన విషయం. కానీ నేను తలచినది ఒకటి అయితే, జరిగినది మరొకటి. అలాగే ఉంచాను కదా.. మెల్లిగా ఆ కాపర్ బల్లాస్ట్ బాగా వేడెక్కి పైనున్న ప్లాస్టిక్ బాడీ కూడా కరిగిపోయింది. నేను చూస్తుండగానే - లోపల ఉన్న రెండు కనెక్టర్ వైర్ల మీదనే  వ్రేలాడసాగింది. అలా నా మొదటి CFL కథ ముగిసింది. 

ఆ తరవాత ఎన్నో CFL బల్బ్స్ వాడాను. చాలా అనుభవం వచ్చేసింది కూడా. ఎంత అనుభవం ఉన్నా, ఒక్కోసారి అందులోనే క్రొత్తవి వాడేటప్పుడు ఎన్నో అనుమానాలు. వాటన్నింటినీ పరీక్షించి కొంత అనుభవాలని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 

అప్పట్లో ఈ CFL బల్బ్స్ చాలా ఖరీదుగా ఉండేటివి. సామాన్యుడు వాటిని ఖరీదు చెయ్యలేని ధరల్లో ఉండేటివి. అంత ధర పెట్టి కొన్నా, వాటి మన్నిక ఎలాగో తెలీదు కాబట్టి చాలా మంది కొనక ఆగిపోయారు. ఈమధ్యనే ఒకసారి వాటిని వాడినవారు అందులోని అందం, మన్నిక, లభ్యత.. చూసి ఖరీదు చేస్తున్నారు. 

ఆ మధ్య చైనా వస్తువులు మార్కెట్లోకి వెల్లువెత్తినప్పుడు, ఎక్కడ చూసినా ఈ CFL బల్బ్స్ లే. ఎవరింట్లో చూసినా ఇవే. కేవలం పదిహేను నుండి పాతిక రూపాయల్లో లభ్యం అవటం మూలాన ప్రజలు వేలంవెర్రిగా కోనేడివారు. వీటికి వెలుతురు తక్కువ అయినా ఆ తెల్లదనం (నీలి రంగులో ఉండే తెల్లదనం) కాంతి కి ప్రజలు బాగా ఆకర్షితులయ్యి, అలాగే వాడారు. చదువులకి కూడా అదే వాడారు. మెల్లమెల్లగా పిల్లలకి తలనొప్పులు రావటం మూలాన, డాక్టర్ల దగ్గరికి వెళ్ళితే - ఆ డాక్టర్స్ కూడా వీటిని వాడొద్దు అన్నారు కాబట్టి వీటి వాడకం మెల్లగా తగ్గింది. ఇక బ్రాండెడ్  బల్బ్స్ ఏమో వందరూపాయల పైన ధరల్లో ఉండేటివి. కాని వీటికి వెలుతురు ఎక్కువ. వీటి కాంతి లేత వంకాయ రంగులో ఉన్న తెలుపులో ఉంటుంది. ఈ వెలుతురులో ఆ రంగు బట్టని చూస్తే చాలా ఆకర్షణీయముగా ఉంటుంది. ఆ షేడ్ కి దగ్గరగా ఉన్నవీ అలాగే ఆకర్షణీయముగా కనిపిస్తాయి. 

ఈ బ్రాండెడ్ బల్బ్స్ కి సంవత్సరం వారంటీ ఇవ్వటం మూలాన, మరేదీ ప్రత్నామాయం కనిపించక పోవటముతో, చైనా బల్బ్స్ మీద ప్రజలకి ఆసక్తి తగ్గిపోవటముతో వీటి అమ్మకాలు మెల్లగా పెరగసాగాయి. ఇప్పుడు ఇవి లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు.. అంతగా ప్రజల ఇళ్ళల్లో చేరిపోయాయి. అలా అలా పెద్ద వోల్టేజ్ బల్బ్స్ అన్నీ అలా వాడుతూపోయాను. 

అలావాడిన బల్బ్ లలో నేను చివరిగా వాడిన వాట్టేజీ 40W - ఇది ఒకసారి వేసవిలో కరెంట్ బాగా కోతలూ, లో వోల్టేజీ ఉన్నప్పుడు - మేమున్న ఏరియాలోని ట్రాన్స్ ఫార్మర్ కి పిచ్చ లోడు ఉండేది. దగ్గర దగ్గరగా మూడు, నాలుగు కాలనీల లోడు దానిమీదే ఉండేది. ఫలితముగా దానిమీద బాగా లోడుపడి బాగా లో వోల్టేజీ - లో కరెంట్ వచ్చేడిది. ఆ కరెంట్ కి ట్యూబ్ లైట్స్ అసలే వచ్చేడివి కావు. ఇక మామూలు బల్బ్స్ అయితే వాటి గురించి చెప్పాలి అంటే - వాటికన్నా కిరోసిన్ దీపాలు నయం. ఇక టీవీ అయితే అసలు ఆన్ అయ్యేదే కాదు. ఒకవేళ ఆన్ అయినా ఫ్లిక్ అవుతూ  ఉండెడిది. అలాంటి సమయములో ఈ బ్రాండెడ్ CFL బల్బ్స్ ఆదుకున్నాయి. మా చుట్టుప్రక్కల్లో మా ఇంట్లోనే దేదీప్యమానముగా వెలుగు ఉండెడిది. అందరూ అలా ఎలా ఉంది అంటూ ఎంక్వైరీ లకి వచ్చేడివారు. అలా అలా మా చుట్టూ ప్రక్కల్లో మెల్ల మెల్లగా CFL బల్బ్స్ వాడకం పెరిగింది. 

CFL 5 W


సంవత్సరం క్రిందట కావచ్చును. CFL లలో ఎంట్రీ లెవల్ లో ఉండే 5W బల్బ్ తీసుకున్నాను. అదీ కాస్త అనుమానముగానే. వాటిమీద MRP 110 రూపాయలు గా ఉంది అయినా 80 రూపాయలకి దొరుకుతున్నాయి. అదీ బేరం చేస్తేనే. లేకపోతే 90 రూపాయలకి అమ్ముతారు. చాలా చిన్నగా ఉండే ఈ బల్బ్ నా లైటింగ్ అవసరాలు తీర్చగలదా? అనే ప్రశ్న నాలో ఉండిపోయింది కూడా.. కాని కాస్త ధైర్యం చేసి కొన్నాను. దాని తరవాత బల్బ్ వోల్టేజీ 8W. మొదట్లో ఆ ఎనిమిది వోల్టుల బల్బ్ తీసుకున్నాను. బిల్ చేశాక ఆ 5W బల్బ్ మీద నమ్మకం ఉంచి, తీసుకున్నాను. బాత్రూం లకి సరిపోతుంది అని ఆ షాప్ వాడు చెప్పాడు. 

ఇంటికి వచ్చాక వాడి చూశాను. బాత్ రూం లకే కాదు. బాల్కనీలకి, చిన్ని చిన్ని గదుల్లోన కాస్త వెలుతురు కోసం వాడే ఏరియాల్లో, రాత్రి పూట ఎప్పుడూ వేసి ఉంచే గ్యారేజ్ లలో, మెట్ల మీదకీ వీటిని శుభ్రముగా వాడుకోవచ్చును. చాలా బాగా వెలుతురుని ఇస్తుంది. మామూలు పిగ్మీ ల్యాంప్ ల కన్నా ఎక్కువ వెలుతురు ఇస్తాయి. కరెంట్ ని తక్కువగా వాడుకుంటుంది. మొదట్లో అపనమ్మకముగా కొన్న ఈ చిన్ని బల్బ్ ని వాడాక, నమ్మకం ఏర్పడి  ఇంకో అరడజను (నిజముగానే - అరడజను = ఆరు) బల్బ్స్ కొని వాడుతున్నాను. 

అంతకు ముందు మామూలు పిగ్మీ బల్బ్ వాడేవాడిని. అది పదిహేను వాట్లు / గంటకి వాడుకొని వెలుగు ఇచ్చేది. ఆ బల్బ్ ని సాయంత్రం ఏడు గంటల నుండి మరుసటి రోజు ఏడు గంటలవరకూ వాడినట్లయితే - పన్నెండు గంటలు వాడినట్లు అవుతుంది.  అలా నెలరోజులకి ఎంత అవుతుందో చూద్దాం. 

ఒక పిగ్మీ బల్బ్ రోజుకి పన్నెండు గంటలు * 15 వాట్లు = 180 వాట్లు ఖర్చు అవుతుంది. అలా నెలకి చూస్తే 180 వాట్లు * 30 రోజులు = 5400 వాట్లు వాడకం అవుతుంది అన్నమాట. అంటే 5.4 యూనిట్ల కరెంట్ వాడుతుంది అన్నమాట. (5,400 / 1,000 వాట్స్ పర్ యూనిట్ = 5.4 kW). ఒక యూనిట్ కి మూడు రూపాయల స్లాబ్ లెక్కన వేసుకున్నా (5.4 * 3) 16 రూపాయల 20 పైసలు. 

అలాగే ఈ 5W CFL వాడితే ఎంత వస్తుందో చూద్దాం. పై లెక్కలోని  విలువలనే ఇక్కడ తీసుకుంటే ఈ CFL ని రోజుకి  పన్నెండు గంటలు * 5 వాట్లు = 60 వాట్లు ఖర్చు అవుతుంది. అలా నెలకి చూస్తే 60 వాట్లు * 30 రోజులు = 1800 వాట్లు వాడకం అవుతుంది అన్నమాట. అంటే 1.8 యూనిట్ల కరెంట్ వాడుతుంది అన్నమాట. (1,800 / 1,000 వాట్స్ పర్ యూనిట్ = 1.8 kW). ఒక యూనిట్ కి మూడు రూపాయల స్లాబ్ లెక్కన వేసుకున్నా (1.8 * 3) 5 రూపాయల 40 పైసలు. 

ఇప్పుడు ఎంత పొదుపో చూద్దాం.. ( 16.20 - 5.40 ) = ఒక బల్బ్ మీద 10 రూపాయల 80 పైసలు అన్నమాట. నిజానికి ఈ లెక్కలు మనకి అచ్చిరావు. "బాగా" పొదుపు చేసేవారికి ఉపయోగకరముగా ఉంటుందని చెప్పాను. ముఖ్యముగా గ్రామీణ పంచాయితీ వారికి వీధి దీపాలకి వాడుటకి ఈ లెక్క బాగా ఉపయోగపడుతుంది. 

1 comment:

వనజ తాతినేని/VanajaTatineni said...

విలువైన సమాచారం.చాలా బాగుంది.ధన్యవాదములు.

Related Posts with Thumbnails