Sunday, October 17, 2010

నా చిన్నప్పటి దసరా జ్ఞాపకాలు.

నాచిన్నప్పుడు దసరా పండుగ అంతా బాగానే జరిగింది.. ఆ జ్ఞాపకాలు ఇప్పుడు మీకోసం.

నా చిన్నప్పుడు బట్టల షాపులో బట్టలు కొని, టేలరుకి అబ్బాయికి ఇచ్చి వాటికి కొలతలు ఇచ్చి, దసరా రేపు అనగా ఈరోజే అతడి వద్దనుండి తెచ్చుకునేవాడిని. ఒక్కోసారి రద్దీ మూలముగా దసరా రోజునే కుట్టి మరీ ఇచ్చేసేవాడు. ఏంచేస్తాం.. ఓపికగా ఎదురుచూసి కుట్టించుకొని మరీ ఇంటికి వచ్చేవాడిని. ఎందుకో మా నాన్న గారు ఆరోజు మమ్మల్ని ఏమీ అనెడివారు కాదు. (రోజూ ఏదో అనెడివారు అని కాదు.) ఆ రోజున మాకంతా స్వేచ్చగా ఉండేడిది. క్రొత్త బట్టలు తెచ్చి దేవుడి వద్ద పెట్టేడి వాళ్ళం. ఆరోజు మటన్ మరియు బిర్యానీ తో బాటూ కొన్ని పిండివంటలూ చేసుకొని, అవి తిన్న తరవాత ఎప్పుడు క్రొత్త బట్టలు వేసుకున్టామా అని ఎదురు చూపులు.

ఆ క్రొత్త బట్టలు వేసుకునేటప్పుడు మా మొఖాల్లో దీపావళి కాంతులే. మా నెత్తిన ఉన్న చింపిరి తలని, మా అంతట మేముగా దువ్వీ దువ్వీ, ఏదో హీరోలా ఉందా అంటే ఉందా అన్నట్లు దువ్వేడివాళ్ళం. క్రోత్తబట్టలు వేసుకొని, వాటిని టక్ చేసి.. (అది టక్ కూడా కాదు.. అలాని మా ఫీలింగ్.) చేతికో పాత వాచీని పెట్టి - అదే లేటెస్ట్ మాడల్ అన్నట్లుగా మాటి మాటికీ చేతిని ఊపుతూ ఉండేడి వాడిని. చెవిలో కాస్త అత్తరు సీసాలో ముంచిన కాస్త దూదీ ని తీసుకొని కాస్త వంటికీ, కాస్త బట్టలకీ రాసి, మిగిలిన దూదిని సాయబు వలె చెవిలో పెట్టుకోనేవాడిని.. అప్పట్లో అదో పెద్ద ఫ్యాషన్ - అలా పెట్టుకోవటం. ఇప్పుడు ఉన్న స్ప్రే బాటిళ్ళు చాలా ఖరీదూ, అరుదు కూడా..

సాయంత్రం ఊరిజనం అంతా అలా ఊరి బయటకి వెళ్ళేవారు.. ఒకదగ్గర అంటే - ఊరి బయటే పాండవులు తమ అజ్ఞాత వాసములో తమ ఆయుధాలని దాచి ఉంచిన శమీ చెట్టు సంతతికి చెందిన ఒక శమీ చెట్టు ఉండేడిది. అక్కడికి అందరమూ చేరుకోనేడివారము. ఆ చెట్టుకి మూడు సార్లూ ప్రదక్షిణ చేసుకొని.. (కొందరు ఐదుసార్లూ) మ్రొక్కెడివారిమి. ఆ చెట్టుకున్న ఆకులనీ, కొమ్మల్నీ "బంగారము" గా భావించి, కాస్త తెంపు కొని, జేబుల్లో నింపుకొని ఆనందముగా అక్కడి నుండి బయలుదేరేవాల్లము. అక్కడే ఉన్న ఆరుబయలు ప్రదేశములో కూర్చొని, ఆకాశము వంక చూస్తూ ఉండేడివాల్లము.

అలా చూడటం ఎందుకు అంటే - ఆ రోజున పాలపిట్ట ని చూడాలని. పాండవులు మహాభారత యుద్ధం గెలిచాక వస్తుంటే ఈ పాలపిట్టనే శుభసూచకముగా ఎదురువచ్చింది. అందుకే ఆ రోజూ పాలపిట్ట చూడాలని ఎదురుచూపులు. ఒక పాలపిట్ట కనిపిస్తే అందరూ చప్పట్లు కొట్టేవారు. అరిచే వారూ - అందరూ దాన్ని చూడాలని. కాని అసలు ఆ పిట్ట ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. కొన్ని సంవత్సరాల క్రిందట నుండి చూడటం జరుగుతున్నది. మీకూ ఆ పిట్ట ఎలా ఉంటుందో ఆ ఫోటో చూపిస్తున్నాను.. చూడండి. దశమి / దసరా రోజున ఈ పాలపిట్ట ని చూస్తే అంతా శుభమే జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది.


అలా ఆ పాలపిట్టని చూసి, దానికి మోకరిల్లి.. చీకటి పడుతుండగా ఇంటికి వచ్చేడివాళ్ళం. రాగానే ఇంట్లోని పెద్దలకి పాదాభివందనాలు చేసేడివాళ్ళం. అలాగే పూర్వికులకీ అలాగే నమస్కరించేడి వాళ్ళం. ఆ తరవాత వచ్చిన అతిదులకీ స్వీట్లూ, నీరూ పంచి బయటపడేవాళ్ళం. అక్కడి నుండి బయలుదేరి మిత్రుల ఇంటింటికీ వెళ్లి, మిత్రుల అమ్మానాన్నలకి "బంగారం" ఇచ్చి దండాలు పెట్టి, మిత్రులని ఆప్యాయతగా కౌగిలించుకోనేడివాళ్ళం. అలా రాత్రంతా అందరి మిత్రుల ఇళ్ళకూ వేల్లెడివారం. ఇంటికి వచ్చేసరికి రాత్రి పదకొండున్నర అయ్యేది.

ఇవీ కాసిన్ని చిన్నప్పటి - నా దసరా మధుర జ్ఞాపకాలు.

7 comments:

చిలమకూరు విజయమోహన్ said...

దసరా శుభాకాంక్షలు మీకు

mmkodihalli said...

విజయదశమి శుభాకాంక్షలు!

mmkodihalli said...

విజయదశమి శుభాకాంక్షలు!

Raj said...

మీకూ, మీ బంధు మిత్ర పరివారానికీ, శ్రేయోభిలాషులకీ - విజయదశమి శుభాకాంక్షలు.. మీ అందరి పైన ఆ అమ్మ చల్లని కృప ఉండాలని కోరుకుంటున్నా..

మాలా కుమార్ said...

దసరా శుభాకాంక్షలు .

Anonymous said...

Dasara subhakankxalu sorry kasta late aeindi I am j.k Raju

Anonymous said...

mee chinnanati madhura gnaapakaalu maathoo share cheskunnaduku thanx andi..ma chinnappati vishayaalu gurthucheskuni happy feel ayyanu....:)dasara pandaga rojuna PALA PITTA ni choosthe maanchidhi ani meeru chepthene thelisindhi..naku theliyani chala vishayalu theliyajesthunnaru..thanq ji...

Related Posts with Thumbnails