Friday, May 14, 2010

బైక్ మీద భద్రాచలం - అన్నవరం టూర్ (2)

..అలా మేము పర్ణశాల కి పోయాము. భద్రాచలానికి కేవలం 33 కిలోమీటర్ల దూరములో ఉంటుందీ ఈ క్షేత్రము. అక్కడ ఒక గుడి. దానివేనకనే ఇంకో గుడి. ఈ రెండింటి మధ్యలో ఈ పర్ణశాల ఉంటుంది.




ముందుగా ఈ గుడిలోకి వెళ్ళాము. అక్కడ తేలికగా దర్శనం అయ్యాక (భక్తులు చాలా తక్కువ కాబట్టి ) పర్ణశాలకి బయలుదేరాము. ఇది ఒకప్పుడు సీతా రామచంద్రులు అరణ్యవాస సమయములో ఇక్కడ ఉండుటకై పర్ణశాల కట్టుకున్నారట! ఇక్కడే సీతమ్మ తల్లి మాయ బంగారు లేడిని చూసి రామున్ని అది పట్టిమ్మని అడిగారుట. ఆ రాముడు ఆ జింక కోసం  వెళ్ళినప్పుడు.. రాక్షస మాయ మాట విని లక్ష్మణుడూ వెళతాడు. అప్పుడు రావణుడు వచ్చి సీతమ్మ తల్లిని ఎత్తుక పోతాడు. ఇదీ పర్ణశాల యొక్క చారిత్రిక నేపధ్యం. ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ ప్రదేశాన్ని సరిగా మెయింటనెన్స్ చేయటం లేదు. అప్పట్లో ఈ ఫోటో కూడా తీసుకోనిచ్చేడివారు కాదు. ఇక్కడ ప్రక్కనే గోదావరి నది గంభీరముగా అలా సాగిపోతున్న దృశ్యం చాలా బాగుంటుంది.


అలాగే ఈ పర్ణశాల ప్రక్కనే భక్త రామదాసు సినిమా కోసం వేసిన సెట్టింగు ఉంది అదీ చూశాము. అప్పుడు ఇలా ఉంది.. కాని ఇప్పుడు ఆ సెట్టింగు అంతా భక్తుల తాకిడికి ధ్వంసం అయిపోయింది. 





అక్కడినుండి తిరిగి వచ్చేటప్పుడు దారి మధ్యలో "జటాయువు వీరమరణం పొందిన స్థలం" అంటూ ఒకటి కమాను ఉంది. అక్కడ అడిగితే మామూలుగా ఉంటుందని తెలుసుకొని చూడకుండానే భద్రాచలం కి తిరిగివచ్చేసాము. రాగానే కొద్దిగా లోకల్ అంతా కలియ దిరిగి, భోజనం చేసేసి.. మా దేవస్థానం వారి కాటేజ్ వారివద్దకి వెళ్లి రేపు మార్నింగ్ రూం ఖాళీ చేస్తున్నామని చెప్పాము. ఉండడానికి పరవాలేదు అన్నట్లు ఉన్న ఆ రూముల అద్దె రెండురోజులకి 150 రూపాయలు మాత్రమే. బాగానే ఉన్నాయి అవి.

మరుసటి రోజు ఉదయాన్నే లేచి స్నానాదులు ముగించుకొని సమయం ఉండటముతో మళ్ళీ గుడికి వెళ్లి దర్శించుకున్నాము. ఈ సారి చాలా తొందరగా అయిపోయింది దర్శనం. ప్రొద్దున్నే ఏడు గంటలకి గుడి తెరుస్తారు. మళ్ళీ ఎందుకెల్లామంటే ఆ అడవి గుండా వెళ్ళితే మంచి భోజనం దొరకదు. అందుకే ఈ భద్రాచలం లోనే తినేసి వెళితే ఎంత ఆలస్యమైనా పరవాలేదు. ఇది గత మా పర్యటనల అనుభవం. అందుకే ఆగాము. ఉదయానే భోజనం కానిచ్చేసి బండి నిండా పెట్రోల్ పోయించుకొని, టైర్లలో గాలి కొట్టించుకొని.. దారిమధ్యలో తినాలన్నా కోరికను ఆపుకునటానికి గుప్పెడు చాకలెట్లు కొని, జేబుల్లో నింపుకొని ఎర్రటి ఎండల్లో బయలుదేరాము.. 

(కొనసాగింపు 3 లో)

No comments:

Related Posts with Thumbnails