Wednesday, February 24, 2010

తెలుగులో టైపు చెయ్యడం ఎలా? - 1

తెలుగులో టైపు చెయ్యడం ఎలా? అని క్రొత్తగా బ్లాగు పెట్టినవారికి, టపాలు, వాఖ్యలు (కామెంట్స్) వ్రాసేవారికీ, గూగుల్ వాడి ఇతర సైట్లలో (ఉదాహరణకి ఆర్కుట్) తెలుగు వ్రాయడం మొదట్లో అర్థం కాదు. చాలా కష్టతరముగా అనిపిస్తుంది. ఎందుకొచ్చినదిరా ఈ గొడవ.. అనుకుంటూ అనాసక్తులమై పోతాము. తెలుగులో వ్రాయడానికి ఎన్నో పద్దతులు ఉన్నాయి.. చాలా తేలిక పరికరాలు మనకి అందుబాటులో ఉన్నాయి. కావాలంటే ఈ లింక్ తెలుగులో టైపు చెయ్యడం ఎలా? నొక్కి చూడండి.. మీ సందేహాలు ఎంతో తీరతాయి..

నేను వాడేది - గూగుల్ వాడి లిప్యంతరం. మొదట్లో అంటే నా బ్లాగుని మొదలెట్టిన రోజుల్లో నా బ్లాగులో తెలుగు సరిగా వచ్చేడిది కాదు. బహుశా నేను బ్లాగులకి క్రొత్త కావడం వల్లనో, టైపింగ్ సరిగా రాకపోవటమో, గూగుల్ లిప్యంతరం అప్పుడు ఇంతగా అభివృద్ధి కాకపోవటమో, ఎలా వ్రాయాలో తెలీనితనం వల్లనో గాని.. మొదట్లో నా బ్లాగుని వ్రాస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను.. సరిగ్గా గుర్తుంది. అప్పుడు ఈ బ్లాగులోని తెలుగు ట్రాన్స్లేషను ఇప్పుడున్నంత బాగా అప్పుడు లేదు. ( ఇపుడు చాలా బాగా అభివృద్ధి చేశారు ) అప్పట్లో తెలుగులో వ్రాయటానికి చాలా కష్టపడ్డాను.ఎవరి సహాయము లేకనే ఏకలవ్యుడిలా నేర్చుకున్నాను. అప్పుడు బ్లాగు లోని తెలుగు కన్నా గూగుల్ వాడి - ఆర్కుట్ లోని తెలుగు ట్రాన్స్లేషను చాలా బాగా ఉండేడిది. ఒక కమ్మ్యూనిటీ లో సినిమా పాటలు వ్రాసానని నేను ఇంతకు ముందే చెప్పానుగా. అలా ఆ పాటలూ ( 90 వరకూ ఉంటాయి ), స్క్రాపులూ వాసేసరికి తెలుగులో వ్రాయటం చాలా బాగా అలవాటయ్యింది. ఇలా అలవాటయ్యాక ఇంగ్లీషులో వ్రాయటం నిజముగానే మనసొప్పటం లేదు. మొదట్లో ఆర్కుట్లోని స్క్రాప్ బుక్ లో వ్రాసి, నా బ్లాగులో పేస్ట్ చేసేవాడిని. ఇప్పుడు డైరక్టుగా నా బ్లాగులోనే వ్రాస్తున్నాను. ఇప్పటికీ బ్లాగులో వ్రాయటములోని ఒక ఇబ్బంది ఏమిటంటే పెద్ద టపా వ్రాసేటప్పుడు కొద్దిసమయము తీసుకొని తెలుగులోకి మారుతుంది. ఏవైనా తప్పులు దిద్దాలంటే నెమ్మదిగా జరుగుతుంది. చాలా పెద్దగా ఉంటే ఆర్కుట్లో వ్రాసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను - ఇంకా.

ఇదీ నా బ్లాగు మొదలెట్టిన మొదట్లోని తెలుగు లిప్యంతరం ఇబ్బందులు. ఇలాంటివి మీకూ ఏర్పడి ఉండొచ్చు. అందుకే మీకు - ఈ గూగుల్ లిప్యంతరము వాడుతున్నప్పుడు ఎలా తెలుగు వ్రాయాలో మీకు కొన్ని క్లాసులు ( ఆ కోప్పడే క్లాసులు కావండీ.. తరగతి పాఠాలు అన్నమాట! ). వ్రాయలేనివారు ఎలా వ్రాయాలో తేలికగా నేర్చుకోండి. ఇలా నేర్చుకున్నందులకి నాకేమీ డబ్బులు ఏమీ ఇవ్వనవసరం లేదు. అదేదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్లు మీది తెనాలా? మాదీతెనాలే! ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఇకనుండీ పాఠాలు మొదలెడుతాను. శ్రద్ధగా అనుసరించండి.. తెలుగు పదాలూ, వాటి ఇంగ్లీషు రోమన్ పద్ధతి చెబుతాను.. అందరూ, క్రొత్తగా బ్లాగుని పెట్టినవారు మరీ శ్రద్ధగా వినండి / చదవండి..

శుక్లాం భరధరం విష్ణూం | శశివర్ణం చతుర్భుజం | ప్రసన్నవదనం ధ్యాయేత్ | సర్వ విఘ్నోప శాంతయేత్ |
సర్వ అవిఘ్నమస్తు..

(టింగ్.. టింగ్.. టింగ్.. టింగ్ గ్ గ్ గ్... )

అప్పుడే గంట కొట్టేసారే!
మొదటి పాఠం సమయం ముగిసింది.
రేపటి క్లాసులో మిగతాది చెప్పుకుందాం..
బ్లాగర్లూ అందరికీ సెలవు.

No comments:

Related Posts with Thumbnails