Tuesday, November 3, 2009

కల్తీ నివారణలో మన వంతు..

ఆమధ్య నా మోటారు సైకిల్ కి 2T ఆయిల్ తక్కువైతే కొనుగోలు చెయ్యటానికి దగ్గరలో ఉన్న ఆయిల్ కొట్టుకి వెళ్లాను.. ఆ కొట్టువాడు నన్ను గుర్తుపట్టి బాగా పలకరించాడు..

నా అవసరమేమిటో చెప్పాను.. 2T ఆయిల్ 2 స్ట్రోకుల బండికి తప్పనిసరి. లోపలినుంచి కాస్ట్రాల్ 2T ఆయిల్ డబ్బా తీసుకొచ్చాడు.. మడ్డిగా, మురికిగా ఉన్న ఆ డబ్బాని బట్టతో తుడిచి మరీ ముందుపెట్టాడు. కస్టమర్ రిసీవింగ్ చాలా బాగా బాగుంది అనుకుంటూ రేటెంతో అడిగాను.. "అన్నయ్యా! బయట వారికైతే MRP మీకే కనుక 5రూపాయలు తక్కువియ్యండి.." అంటూ ఎనిమిది రూపాయలు తక్కువ తీసుకున్నాడు..

ఆహా! ఎంత మంచివాడురా ఇతను అనుకుంటూ.. ఇంటికొచ్చి నా బండిలో ఆ 2T ఆయిల్ పోసాను. కాస్ట్రాల్ కంపనీది కనుక ఆ ఆయిల్ ఎలా ఉందో చూడలేదు.. జస్ట్ నమ్మకంతో ఆ పని చేశాను.. ( ఇంటి వద్దే పోసుకోవటం ఎందుకంటే - ఆ బండిలో 700 మీ.లీ. మాత్రమే పోయాలి. ఎక్కువ పోస్తే కారిపోతుంది. ఇంకో 300 మిలీ అలాగే ఉంచుతాను. బండిలోనిది అయిపోగానే ఇది పోస్తాను. ) కొద్దిరోజుల తరవాత బండిలోని ఆయిల్ అయిపోతే మిగిలినది పోస్తుంటే గమనించాను.. ఆ బండి డబ్బాలో నల్లని మెత్తటి మడ్డి.. ఇదేక్కడిదా అని ఆలోచించాను కాని ఏమీ తట్టలా.. మిగతాది పోసాక ఆ ఆయిల్ డబ్బా లోపలికి చూసాను.. సన్నటి నల్లని మడ్డి.

కాస్ట్రాల్ కంపెనీ వాళ్లు ఇలా భాద్యత లేకుండా ప్యాకింగ్ చేస్తున్నారా అనుకుంటూ నా దైనందిక కార్యక్రమాల్లో మునిగిపోయాను. ఆ తరవాత పది రోజులకి అనుకుంటా - ఓ మాంచి పాఠం నేర్చుకున్నాను.. ఓ పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తున్నప్పుడు నా బండి దుకాణం పెట్టేసింది. దారిలో గుట్టలలో నా బండి పిస్టిన్ పట్టుకుంది.. కదలనని మొరాయించింది.. గేరులలో వేసినప్పుడు వెనక టైరు ఇంచైనా జరగటం లేదు. కిక్కు రాడ్డూ డిటోనే! చేసేది లేక బండిని అలా నెట్టుకుంటూ సమీపములోని ఒక గ్రామానికి తీసుకొచ్చాను. రాత్రికి అక్కడే బండిని వదిలేసి, తెల్లారి మెకానిక్ ని పంపాను.. అతను బండి పిస్టిన్ పట్టుకుందని, అది మార్చాలనీ... అంటే మార్పించాను చేసేదేమిలేక.

నాలుగువేల రూపాయల ఖర్చు అయాక .. చివరిగా అతడిని అడిగాను అలా ఎందుకయ్యిందని.. అతను "పిస్టిన్ కి వచ్చే ఆయిల్ అందక పిస్టిన్ పట్టుకుంది.." చెప్పాడు. షాక్ అయ్యాను.. అంటే ఆ నల్లని మడ్డి ఆయిల్ పైపులో అడ్డం వచ్చి ఇబ్బంది పెట్టింది. ఆ షాప్ వాడి మర్యాద ఏమో గాని నాకు మాత్రం నాలుగు వేల చేతి చమురు వదిలింది..

ఇలా ఎందుకయిందని డిటెక్టివ్ లెవల్లో పరిశోధన మొదలెట్టాను. ఆ కాస్ట్రాల్ డబ్బాని పరిశీలించాను. డబ్బా మీద ప్యాకింగ్ నంబర్లూ, మూత మీద ఉన్న ప్యాకింగ్ నంబర్లూ తేడా ఉండి, మాచ్ కాలేదు.. అంటే - ఎప్పుడో ఎక్కడో ఒరిజినల్ ఖాళీ డబ్బాని సేకరించి పాత వాడిన ఆయిల్ కి కొద్దిగా రంగు కలిపి మళ్ళీ ప్యాకింగ్ చేసారన్నమాట! అదీ సంగతి..

దీనికి విరుగుడు ఏమిటా అని ఆలోచించితే సులభమైన పరిష్కారం దొరికింది.. చాలా మంది కల్తీ దారులకి ఆ వస్తువులను మాత్రమే కల్తీ చేస్తారు కాని దాని ప్యాకింగ్ ని కూడా క్రొత్తగా చేయటానికి ఇష్టపడరు. నా విషయములో కూడా అలాగే జరిగింది. లోపల ఆయిల్ మాత్రం మార్చి, పైన డబ్బా మాత్రం అలాగే ఉంచారు. ఇలా చేయకుండా మళ్ళీ ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏమిటంటే చాలా సింపుల్.. ఆ ఖాళీ డబ్బాలు పడేసే ముందు వాటికి దబ్బడం తోనో, లేదా వాడియైన మొలతో - ఒక రంధ్రం చేస్తే సరి.. ఆ డబ్బాని ఎవరూ వాడలేరు.. ఇది కేవలం ఇలా ఆయిల్ డబ్బాలకే కాకుండా పౌడర్ డబ్బాలకీ, నీళ్ళ కానులకీ, మందుల డబ్బాలకీ, బ్రాండెడ్ వస్తువుల పెట్టలకీ చేస్తే మరీ బావుంటుంది.. మీరు అలా చేస్తారని ఆశిస్తున్నాను..

No comments:

Related Posts with Thumbnails