Friday, September 16, 2016

వినాయక పూజ

ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం వినాయక చవితి ని ఈసారి కూడా బాగా జరుపుకున్నాం. ఆ విశేషాలు ఏమిటో మీకు తెలియచేద్దామని ఈ టపా.
అందరిలాగానే ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవం అందరితో బాటూ జరుపుకుంటూ ఉంటాం.. మామూలుగా ఉత్సవ వివరాలు చెప్పక విశేషాలు మాత్రమే మీకు చెప్పబోతున్నాను. ఇదేదో మా గొప్పకోసమనీ, మా డాబు ప్రదర్శించటానికో చెప్పట్లేదు. ఎవరికి ఎలా అనిపించినా మా పండగ మాది. ప్రతి సంవత్సరానికీ క్రొత్త క్రొత్తగా, ఉత్సవాన్ని కాస్త అభివృద్ధి చేసి చేసుకుంటున్నాం.. మొదట గణేశుడి ప్రతిమని గూట్లో పెట్టి పూజ చేసుకున్నప్పటి నుండి, ఇప్పటివరకు ఎన్నెన్నో మార్పులు. ప్రతి సంవత్సరానికీ ఏదో మార్పు. 

అందరిలాగానే మామూలుగా ఈ ఉత్సవాన్ని జరుపుకునే మాకు - చాలా సంవత్సరాల క్రిందట మా ఆవిడ ఒక ప్రతిపాదన చేసింది. అది - పండగ ప్రారంభం అయ్యాక మూడురోజులకే నిమర్జనం చేసే బదులు నవరాత్రులు పూజ చేశాక, నిమర్జనం చేద్దామని. బాగానే ఉంది కానీ రోజూ ఆ దేవుడికి చేసే కైంకర్యాలు ఎలా? పూజ, పూలదండ, శుద్ధి, పరిశుభ్రత, పూజా సంస్కారాలు, తీర్థ ప్రసాదాలు... ఇవన్నీ రోజూ శుభ్రతతో శుచిగా చెయ్యాలి. అప్పుడే ఆచారాలని సక్రమముగా నిర్వర్తించినట్లు. ఒకవేళ అలా చెయ్యడం అవకుంటే - ఆ ఆలోచనని మానుకోవడమే బెస్ట్. కానీ తన చిన్నప్పటి నుండీ ఇది కోరికనట. కాదని అనలేను.. అలాని అంటే తనని నొప్పించినట్లు అవుతుంది. పూజాఫలం మిస్ అవుతానేమో అనే శంక.. ఒప్పుకుంటే తన చిన్నప్పటి కోరికా నేరవేర్చినట్లు అవుతుంది. ఆ పూజ వల్ల మంచి అవుతుందేమో అని ఆశ. ఒప్పుకుంటే బయట వ్యవహారాలూ ( అంటే ప్రతిమ తేవడం, ప్రసాదాలకు కావలసినవి తేవడం.. నిమర్జనం చెయ్యడం వంటివి ) నావి, పూజా వ్యవహారాలు తనవి ( పూజ చెయ్యడం, శుచీ, శుభ్రత, ప్రసాదాల తయారీ, అవి పంచడం.. లాంటివి. ) ఇంత వివరముగా ఎందుకు చెబుతున్నానూ అంటే ఎవరికైనా ఇలాగే చేసుకోవాలని అనిపిస్తే కాస్త వివరముగా ఉంటుందనీ.. 

దాదాపు పదిహేను సంవత్సరాల క్రిందట నుండీ అలా ఇంట్లోనే నవరాత్రులనీ చెయ్యడం మొదలెట్టాం.. మొదట్లో మట్టి విగ్రహాలనే పూజకి పెట్టేవాళ్ళం.. ఈ లడ్డూ ప్రాముఖ్యతని గుర్తించి, ఆ తరవాత వామ హస్తంలో లడ్డూ ఉంచడానికి కోసమని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకి మారాల్సి వచ్చింది. ఇలా ఎడమ చేతిలో లడ్డూ పెట్టడానికి అనువుగా ఉండే మట్టి ప్రతిమలు దొరికితే మరింత సంతోషమే... 

ఒకప్పుడు ప్రతిమలు ముందుగా కొనేవాళ్ళం. పండగ రోజున ధర ఎక్కువగా ఉంటుందనీ. ఇప్పుడేమో అమ్మే వాళ్ళు ఎక్కువై, పండగ రోజున తక్కువలో ( ఆరోజు గనుక అమ్మకపోతే వాటిని వచ్చే సంవత్సరం వరకూ కాపాడాల్సిందే, వడ్డీ నష్టం మరొకటి.. ) అందుకే ఆరోజునే తక్కు వగా ధర ఉంటుంది - స్టాక్ ఎక్కువగా ఉంటే. 

సత్యనారాయణ స్వామివారి పూజాపీటని ఈ ఉత్సవానికి వాడుతున్నాం.. ఆ రెండు పూజలకి మిక్కిలిగా ఆ పీట ఉపయోగపడుతున్నది. భక్తి, శ్రద్ధలతో వినాయక వ్రతం చేశాక, ఎప్పటికప్పుడు మరిన్ని అలంకరణలు చేస్తూ బయట మండపాలకి ఏమాత్రం తగ్గకుండా ప్రతిరోజూ స్వామివారికి చెయ్యాల్సిన కైంకర్యాలు చేస్తూనే ఉన్నాం. ప్రతి ఏటా కాస్త మార్పులు చేస్తూనే ఉన్నాం. 

ఉదయాన శుచిగా పరిసరాలని శుభ్రం చేసి, ఆ తరవాత పూజ చేసి, ఆ సమయం తరవాత హోం థియేటర్ లో భక్తి పాటలు పెట్టి.. సాయంత్రాన రోజుకో వెరైటీ ప్రసాదాలు నివేదన చేసి, ఆ పిమ్మట చుట్టూ ప్రక్కల వారికి పంచటం.. జరుగుతుంది. ఇలా నవరాత్రులూ జరుగుతుంది. ఈసారి వినాయకుడి మీద లైట్ ఫోకస్ ని ఏర్పాటు చేశాను. 3watts LED బల్బుని లోపలి వైపుగా అమర్చాను. ఫలితముగా విగ్రహం దేదీప్యమానముగా వెలిగిపోతున్నది. ప్రొద్దున పూజ నుండీ రాత్రి వరకూ ఆ లైట్ వెలుగుతూనే ఉంటుంది. క్రిందన ఉన్న రెండు ఫోటోలలో చివరి ఫోటో అప్పటిదే. 

ఇక నిమర్జనం రోజున పెద్ద విగ్రహాలను పెట్టినవారికి మా విగ్రహాన్ని ఇచ్చి నిమర్జనం చేయించేవాళ్ళం. కానీ గత నాలుగైదు సంవత్సరాలుగా మేమే స్వయంగా పది కిలోమీటర్ల దూరంలోని చెరువులో నిమర్జనం చేస్తున్నాం.. ఈసారి మా అమ్మాయి తను నిమర్జనం చేస్తానని అంటే తననే చేయనిచ్చాం.. 

ఇవీ మా వినాయక ఉత్సవం ప్రత్యేకతలు. చిన్నబడ్జెట్లోనే కానీ బాగా ఆడంబరముగా, శుచిగా, త్రికరణ శుద్ధిగా, బయట ఎలా చేస్తున్నారో అలాగే మేమూ ఈ నవరాత్రులూ చేస్తున్నాం.. శ్రావణ మాస ఆరంభం నుండీ ఈ వినాయకనిమర్జనం వరకూ నీచు (Non-veg) పూర్తిగా బంద్. ఇలా అందరి వద్దా ఉండొచ్చు.. కానీ మా పద్ధతులని మీకు తెలియచేశాను. మాకు అంతా మంచే జరుగుతున్నది కూడా.. వచ్చే ఏట కూడా మరింత బాగా జరుపుకోవాలని అనుకుంటున్నాం.. ఈపోస్ట్ ని ఎప్పుడో వ్రాయాలని అనుకున్నా.. కానీ, నేడు నెరవేరింది. 

ఓం గం గణపతయే నమః 

వినాయక ఉత్సవం 2016

రాత్రివేళ 


2 comments:

Lathajawahar said...

అసలు వినాయకుడి చేతిలో లడ్డు ప్రాముఖ్యత ఏంటో వివరంగా చెపుతారా?కేవలం లడ్డు కోసం ఎంతో ఆదర్శంగా ఉండే ఎన్నో మంచి విషయాలు చెప్పే మీరు ప్లాస్టరాఫ్ పారిస్ తో చేసిన విగ్రహం పెట్టడం అస్సలు నచ్చలేదు.

Raj said...

లడ్డూ ప్రాముఖ్యత అంటూ ఏమీ లేదు.. నా దృష్టిలో సెంటిమెంట్. భగవంతుడి చేతిలో అలా ఉండాలి అని అనుకున్నదే తప్ప మరేమీ లేదు. మా ఏరియా అలాంటి ప్రతిమ కోసం మార్కెట్లో చివరివరకూ వెదికాను. (చాలా చోట్ల) అలా చేతుల్లో లడ్డు పెట్టేలా - మట్టి విగ్రహానికి చేయి బయటకి అమర్చరు. అసలు ఆ చేయి ఎక్కడ ఉందో వెదుక్కోవాలి. ఈ ఇబ్బందిని తొలగించేలా మట్టి వినాయకుల్లో అలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని పై టపాలో చెప్పాను కూడా. అలా చేతిని పెట్టడమూ సులువే కానీ తయారీదారులు అలా ఎందుకు ఏర్పాటు చెయ్యరో నాకు అర్థం కాదు. ఇక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం పెట్టడం నాకూ ఇష్టం లేదు.. వచ్చే ఏడు నుండి - మీ (అందరి) కోరిక నెరవేరేలా మట్టి విగ్రహానికి ఉపయోగిస్తాను.

Related Posts with Thumbnails