Tuesday, July 28, 2015

గోదావరి పుష్కర యాత్ర - 3

http://achampetraj.blogspot.in/2015/07/2.html తరవాయి భాగం..
...అలా బండిని చూస్తున్నప్పుడే - మమ్మల్ని దాటి ఒక మోటార్ సైకిల్ వెళ్ళి కొద్ది దూరములో ఆగింది. దానిపైన క్రొత్తగా పెళ్ళైన యువజంట. నేను అప్పుడు క్రిందన కూర్చొని, సమస్య ఏమై ఉంటుందా అని చూస్తున్నాను. ముందు కొద్దిదూరములో వారు ఆగారు. అక్కడ నుండి మమ్మల్ని చూస్తున్నారు. అది మా అమ్మాయి "వారు అక్కడ నుండి మనల్నే చూస్తున్నారు డాడీ!.." అన్నది. నేను వారిని చూశాను అన్నట్లు, గాలిలో చేతిని ఊపాను. ( ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి, ఏదీ వదులుకోవద్దు ) వారు గమనించారు.. దగ్గరికి వచ్చారు. ఏమైంది అని అడిగితే - " ఏదో ప్రాబ్లెం.. ఇంజన్ విప్పాలేమో..!! ఇంజన్ ఓకే. స్టార్ట్ అవుతున్నది.. వెనక చక్రం కూడా ఓకే. ఫ్రీగా మూవ్మెంట్ ఉంది.. బేరింగ్స్ కూడా వొకే. బహుశా ఇంజన్ నుండి వెనక చక్రానికి మధ్యన ఉన్న బెల్ట్ / చైన్ లింక్ తెగిందేమో.. అలా అయ్యేముందు లకలకమంటూ శబ్దం వచ్చింది.. " అంటూ ఆ శబ్దాన్ని మిమిక్రీ చేశాను. ( ఇలా ఎందుకూ అంటే - అవతలివారు మెకానిజం లో అవగాహన ఉంటే - అలా సమస్య మొదట్లో ఆ శబ్దం ఎక్కడ, ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. అలా సమస్యని తేలికగా తెలుసుకొని, సమస్య ఏమిటో తేలికగా నిర్ధారించుకోగలుగుతారు. ఎదుటివారు మెకానిక్స్ అయితే ఇది వారిముందు చేస్తే చాలా తేలికగా మన సమస్య అర్థమవుతుంది ) నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. నాకు తెలిసీ - బెల్ట్ / చైన్ తెగింది అనుకున్నాను ) నేను చేసిన మిమిక్రీ కి ఏమీ స్పందన చూపెట్టలేదు. కారణం తనకి మెకానిజం తెలీనట్లుంది.

వారూ పుష్కరాలకి వేల్లోస్తున్నారు. వారి డిటైల్స్ చెప్పారు. మావీ చెప్పాను. నిజమా కాదా అన్నట్లు కొన్ని ప్రాంతీయ విషయాలు అడిగారు.. వాటికి క్లారిటీ ఇచ్చాను. అప్పుడు వారికి మాపై నమ్మకం కలిగింది. ( అంత రాత్రిన అయినా, ఎప్పుడైనా అలా సహాయానికి వెళ్లేముందు కనీస వివరాలు తెలుసుకోవడం / పరీక్షించడం ఉత్తమం. ఎంతవరకూ నమ్మోచ్చో, కాదో తెలుస్తుంది ) " అమ్మో! అంత దూరమా.. ఈ స్కూటీ మీదనా! ఇది అంత పెద్ద దూరాలకి సరిపోదు. అందుకే ఇలా అయినట్లుంది.." అన్నారు. ( వారి హీరో స్ప్లెండర్ ఇంజిన్ 97.2 cc వారి బండికీ, మా బండికి తేడా కేవలం 10 cc మాత్రమే తేడా! ఆ మాత్రం దానికే లాంగ్ డ్రైవ్ కి పనికిరాదా? ఆలోచనల్లో ఏదో తేడా. అయినా వారు అదే హైవే మీద రైడింగ్ లో కనిపించారు. మేము వారిని మూడుసార్లు ఓవర్ టేక్ చేసి వెళ్ళాం. నాకు గుర్తుంది. వారి డిటైల్స్ కొన్ని తప్పు చెప్పారు. అవన్నీ ప్రస్తావించలేదు. ఇక్కడ వారి సహాయం నాకు ముఖ్యం. వాదనలు అనవసరం ) " అవునేమో!.. వారం క్రిందటే పార్ట్స్ మార్పించాను.. అంతా బాగుంది అనుకున్నాకే బయలుదేరాం.. ఇలా అయ్యింది.." అన్నాను.

ఒకవైపు మాట్లాడుతున్నానే గానీ, మరోవైపు ఏమిటీ కింకర్తవ్యం? అని ఆలోచనలు చేస్తున్నాను. అంతరాత్రి సర్వీస్ సెంటర్స్ ఉండవు.. మరుసటిరోజు ఆదివారం. ఇక సోమవారం మధ్యాహ్నం వరకూ ఆగాల్సిందే. అయినా నా పద్ధతులు / దారులు నాకున్నాయి. అన్నింటికన్నా మించి అమ్మాయి భద్రత గురించి ఆలోచన చెయ్యాలి. అలా చేయాలీ అంటే ముగ్గురం ఒకే దగ్గర ఉండాలి. త్వరగా సెక్యూర్డ్ ప్లేసుకి వెళ్ళాలి. తక్కువ ఖర్చులో ఎక్కువ భద్రతని చూసుకోవాలి. బండి పోతే పోనీ. నాకు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఈరోజు క్రొత్త కాదు.. కానీ ఇలా అందివచ్చిన సహాయాలను తప్పక వాడుకోవాలి. అవి పూచిక పుల్లకు కూడా పనికిరాకున్నా సరే..

నా ఆలోచనలు బ్రేక్ చేస్తూ - " మరి బండిని దగ్గరలోని టవున్ లో పెడతారా? అక్కడ ఈ కంపనీ సర్వీస్ సెంటర్ ఉంది. అదిప్పుడు మూసేసి ఉంటుంది. లేదా తెలిసిన వారి దగ్గర పెడతారా? లేదా ట్రాలీ ఆటోలో తీసుకెల్లుతారా?? ట్రాలీ ఆటో అంటే మాకు తెలిసిన వారున్నారు.. పిలవమంటారా??.. మీకైతే ఏమీ కాదు.. అమ్మాయ్ విషయంలో ఆలోచించక తప్పదు.. " అన్నారు.

మొదటిది వీలు కాదు.. అక్కడ అయినా సోమవారం వరకూ ఆగాల్సిందే.. రెండో సూచన - అక్కడ ఎవరూ లేరు. ఇక మిగిలింది మూడోది.. అవును ట్రాలీ ఆటో బెస్ట్. ఆ పనే చెయ్యాలి. అదయితేనే అన్ని కష్టాలు తీరుతాయి అనుకున్నాను. " సరే.. మీకు ఏదైనా ట్రాలీ తెలిసుంటే పిలవండి.. " అన్నాను.

వారి ఫోన్ లో బ్యాటరీ చార్జ్ లేదని నా ఫోన్ అడిగారు. ఇచ్చాను. నా దాంట్లోంచి కాల్ చేసి మాట్లాడారు. ( వారి ఫోన్ బాగానే ఉంది. వారు కాల్ చేస్తున్నప్పుడు చూశాను కూడా. కానీ ఏదైనా తేడా జరిగితే వారు నా మొబైల్ నుండి చేసిన కాల్ వల్ల నా నంబర్ ఆ ఆటో వారి వద్ద ఉంటుంది. లేదా వారు చేసిన కాలర్ మొబైల్ లో ఉంటుంది. ఆ నంబర్ వల్ల వారు నన్ను తిరిగి దొరకపట్టుకుంటారు. చూడటానికి చిన్నదిగా అనిపించినా, చాలా తెలివైన చర్య అది. ఇలా చిక్కుల్లో పడుతుంటేనే కొన్ని విషయాలు ఇలా తెలుస్తూ ఉంటాయి ) అక్కడ దగ్గరలోని మరో చిన్న గ్రామం నుండి ఆటో పిలిపించారు... ఆటో వచ్చింది. ట్రాలీ ఆటో కాదు.. అది లేదట. APE డిజిల్ ఆటో అది. రేటు మాట్లాడమన్నారు. ఆటో అతను రెండు వేలు చెప్పాడు.. అది చాలా ఎక్కువ. దగ్గరలో కనిపిస్తున్నదాబాల వద్ద బండి పెట్టేసి, ఎలాగైనా ఏదో వాహనం మీద ఇంటికి వెళ్ళేసి, ఉదయాన మళ్ళీ వచ్చి బండి తీసుకెళ్ళాలి అని నాఆలోచన.. అలా అయితే రెండు వందల రూపాయల ఖర్చుతో బండితో ఇంటికి వెళ్ళగలను... ఇతన్నే మాట్లాడమన్నా.. చివరికి Rs.1300 కి మాట్లాడాడు. అదీ ఎక్కువే.. అంతకన్నా తక్కువ కాదన్నాడు.. నిజానికి 800 సరిపోతుంది. ఏం చేస్తాం.. చీకటి + తప్పని పరిస్థితి + అమ్మాయి ఉండటంతో తప్పలేదు. ఆ ఎక్కువ - వారికి బోనస్ గిఫ్ట్ అనుకోవాలి అనుకున్నాను. ఇక్కడ సెక్యూరిటీ ముఖ్యం. తప్పదు. ముగ్గురం కలసి ఆటోలోకి స్కూటీని ఎక్కించాం. సాయం చేసినందులకు కృతజ్ఞతలు చెప్పాను.. " దేవుడే మిమ్మలని మాకోసం పంపాడులా ఉంది.. మీరు లేకుంటే ఈరోజు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మీ మేలు మరవలేము " అన్నాను. ఒకసారి హగ్ చేసుకున్నాను. ఇక ఆటో ఎక్కేసి, వచ్చేసాం.

నిజానికి ఆ ఆటో వారు రాకపోతే - ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి దగ్గరగా ఒక డాబా కనిపిస్తున్నది. దాని తాలూకు లైట్స్ అక్కడికి కనిపిస్తున్నాయి. అక్కడ బండి పెట్టేసి, ఏదైనా వాహనంలో ఇంటికి వచ్చేసి, మరుసటి రోజున మెకానిక్ తీసుకొని బాగుచేయించి, తీసుకోచ్చుకోవాలన్నది నా ఆలోచన. వారు రాకుంటే అలాగే చేసేవాడిని. చాలామంది రహదారుల మీద ఎక్కువగా ఇలాగే చేస్తుంటారు.

ఇంటికి వచ్చాక ఆ ప్యాసింజర్ ఆటో నుండి ఆ స్కూటీ రాలేదు. రోడ్డు జంపింగ్ లతో ఆటోలో ఇరుక్కుంది. సాయం కోసం ఒక బైకర్ ని పిలిస్తే వచ్చి, సాయం చేస్తే - ఈజీగా ఆ బండిని నేల మీదకి దించాం. ఈ బైకర్ ముస్లిం అయి ఉండీ, రంజాన్ సందర్భముగా క్రొత్త బట్టలు వేసుకున్నా - ఏమాత్రం ఫీల్ అవక, పిలవగానే వచ్చి క్షణాల్లో వచ్చి సాయం చేశాడు... థాంక్స్ చెప్పాను.

తెల్లారి వేరే పని ఉండి, ఆ పని అంతా చూసుకొన్నాను. మరుసటి రోజున - ఉదయాన అ బండిని పడుకోబెట్టి, క్రింద ఛాంబర్ చూశా.. ఆయిల్ + మడ్డితో ఉండి, సరిగా కనిపించకపోతే - వాటిని శుభ్రం చేసి, చూశా.. అంతా ఓకే.. చాంబర్ కి ఏమీ కాలేదు. మరి ఆయిల్ ఎక్కడిది అని చూస్తే - ఇంజిన్ కవర్ కి ఉండే ప్యాకింగ్ పేపర్ అక్కడక్కడా బ్రేక్ అయ్యింది. అలా అందులోంచి ఆయిల్ చిన్న లీక్. దానికే ఛాంబర్ పగిలింది అనుకున్నా. హమ్మయ్య.. అంతా ఓకే.. నేను అనుకున్నట్లే - లోపల బెల్ట్ / చైన్ పోయినట్లుంది.

వారం క్రిందట సామానులు వేయించానూ అని అన్నాను కదా.. అప్పుడు క్లచ్ అసెంబ్లీ, ప్లగ్, ఎక్సిలరేటర్ కేబుల్, 6 రోలర్ బేరింగ్స్ వేయించాను.. ఆ కంపనీ వారి షో రూం వారి వద్దకి తీసుకవెల్లాలీ అంటే అదో శ్రమ. కారణం చాలాదూరం నెట్టుకపోవాలి. అందుకని వారికే వద్దకే వెళ్ళి, ప్రాబ్లం చెప్పి, చెయ్యమన్నాను. వారు ఖాళీగా ఉన్నా రావటానికి ఇష్టపడలేదు.... చివరికి వచ్చారు. ఇంజన్ కవర్ విప్పి చూస్తే - టీత్ బెల్ట్ ముక్కలు ముక్కలు అయ్యింది. ప్రాబ్లెం ఎక్కడా అని అడిగితే - ఆ 6 రోలర్ బేరింగ్స్ వేశాక, దాని మీదుగా బెల్ట్ పుల్లీని ఒక నట్ సహాయాన బిగిస్తారు. అది లూజ్ అవటంతో అలా బేరింగ్స్ కదిలి, ఆ పుల్లీ ఆ బెల్ట్ ని రన్నింగ్ లో కోసేసింది. ఆ నట్ ని బాగా టైట్ గా బిగించక పోయేసరికి ఇలా తిప్పలు పడ్డాను. ఆ నట్ బాగా టైట్ చెయ్యటానికి మరో నిమిషం పడుతుంది అంతే.. ( నా చేతిలో లేని / నాప్రమేయం లేని ) ఒక చిన్న తప్పు నన్ను, నా కుటుంబాన్నీ అంతగా ఇబ్బంది పెట్టింది. ఆ నట్ కి కాటర్ పిన్ పెట్టవచ్చేలా ఉండే నట్ అక్కడ పెడితే, ఇలాంటి ప్రాబ్లెం ఎవరికీ మళ్ళీ రాదు కూడా.. టైర్ చక్రం బిగింపు కోసం వీల్ ఏక్సిల్ Wheel axil వద్ద అలా పెడతారు. అదే పద్ధతి అక్కడా పెడితే నాలాంటి ఆవస్థలు ఎవరూ పడరు. కాటర్ పిన్ అన్నది చిన్న స్టీల్ తీగ ముక్కనే కానీ, నట్ ఒకవేళ వదులు అవ్వాలని చూసినా ఆ నట్ ని ఏమాత్రం వదులుకానివ్వదు. మొత్తానికి 1300 + 514 బెల్ట్ ఖరీదు = 1814 రూపాయలు + మనశ్శాంతి కరవు. కొన్ని నట్ సాంకేతిక అంశాలు వైఫల్యాలు, మానవ తప్పిదాలు ఇలా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఏమైనా అందామంటే - ఇన్ని కిలోమీటర్లు తిరిగినపుడు ఏమీ కాలేదు కదా.. వేసి వారం అయ్యింది కదా.. అప్పుడు కానిది ఇప్పుడెలా అయ్యింది అంటే ఏమీ బదులివ్వలేం.. ఊరుకోవడమే ఉత్తమం. ఏమైనా గానీ కొన్ని అనుభవాలు చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి విషయాలు తెలీని వారికీ, నాలాగా లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళాలనుకొనేవాళ్ళు ఈ జాగ్రత్త తీసుకోవాల్సివలసిందిగా నా మనవి. కాటర్ పిన్, నట్ అంటే తెలీని వారు ఈ క్రింది ఫోటో చూడండి. ( ఈ ఫోటో స్కూటీది కాదు వేరే దానిది. దాన్ని నేను గూగుల్ ఇమేజెస్ నుండి సేకరించాను.. ఫోటో వారికి కృతజ్ఞతలు. మధ్యన ఆరు పలకలుతో ఉన్నది నట్, దాని చీలిక గుండా సన్నని ఇనుపతీగని కూడా చూడండి. ఈ విషయం మీకు అర్థం చెయ్యాటానికి వాడుకుంటున్నాను..) ఆలా చేస్తే - నట్స్ ఎన్నడూ వదులు కావు. ఒకవేళ వదులైనా - ఆ కాటర్ పిన్ వదులు కానివ్వదు. చూడటానికి చిన్నదిగా ఉన్నా సాంకేతికముగా గొప్పది. చాలా ఉపయోగపడుతుంది. ఇలా వాహనాల టైర్ కి ఉండే ఫోర్క్ ఎక్సిల్ కి నట్ మధ్య భాగాన, ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ బోల్ట్ లకీ ఆ కాటర్ పిన్ ఉంటుంది. ఇకనైనా ఆ కంపనీ వారు ఇలా మిగిలిన బళ్ళకీ ఏర్పాటు చేస్తే మరీ బాగుంటుంది. ఒక ఉత్పత్తి అన్నివిధాలా నచ్చాలీ అంటే - ఇలాంటి చిన్న చిన్న లోపాలని కూడా తొలగించాలి. అయినా ఇదేమైనా పెద్ద ఖర్చు కాదు. ఎక్సిల్ కి ఒక రంధ్రం, ఒక కాటర్ పిన్ అంతే.. మహా అంటే ఖర్చు ఐదు రూపాయలు కన్నా మించదు - TVS Scooty కంపనీ వారికి.


పాడయిన చోట ఆ జంట రాకపోతే - మేము ఎన్ని కష్టాలు ఎదురుకోవాల్సి ఉంటుందో.. అది నేషనల్ హైవే కాబట్టి అలా వెంటనే వచ్చాం. అదే స్టేట్ హైవే  అయితే - వోరినాయనో... అనుకోవాల్సిందే.. ఇంకోసారి లాంగ్ డ్రైవ్ అన్న ఊసే ఎత్తే పరిస్థితి రాని అనుభవాలు అయ్యేవేమో. మా మీద ఆ పుష్కరుడి + బాసర అమ్మవారి దయ వల్లే అనుకుంటా అలా క్షేమముగా ఉన్నామని అనుకున్నాను.

అయినా ఇదీ ఒకరకముగా మాకు మేలే చేసింది అనుకుంటున్నాను. జరిగినవన్నీ మన మంచికే అనుకోవాలి. ఎలా అంటే -

  • పిల్లలకి ఈలోకం అంటే ఏమిటో, ఎలా ఉంటుందో పరిచయం చెయ్యటానికి తీసుకెళ్ళాను అని చెప్పాగా. అది చూపించాను. పుష్కరాలు అంటే ఏమిటో ఎలా ఉంటుందో, వివరముగా తెలుసుకున్నారు - కారణం - బండి. బండి మీద అన్ని స్నానాల ఘాట్స్ వెంబడి ప్రయాణించాం కాబట్టి. 
  • తామెన్నడూ చూడని క్రొత్త ప్రదేశాల గుండా వెళ్ళాం. అలా ఈ పేర్లతో కూడిన ఊళ్ళు ఆ దారిలో కనిపిస్తాయి.. అవి అలా ఉంటాయీ అని తెలిసాయి. ఆ దారిలో వారు అంత దూరం ఏనాడూ వెళ్ళలేదు. ( నాకూ అంతే ). 
  • మా అమ్మాయికి లాంగ్ డ్రైవ్ లో తానే డ్రైవింగ్ చెయ్యాలన్న కోరికా నెరవేరింది. 
  • లాంగ్ డ్రైవ్స్ అంటే ఏమిటో తెలియచేశాను. వారికి ఇది రెండోది. 
  • అలా వెళ్ళినప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఏమేమి ఎలా చూసుకోవాలో, ఎలా జాగ్రత్తగా ఉండాలో, లేకుంటే ఎంతగా నష్టపోతామో, ఎలా ఎంక్వైరీ చేస్తూ వెళ్ళాలో - నాకు తెలిసింది చెబుతూ వెళ్లాను. 
  • చిన్న చిన్నవస్తువులే కావొచ్చు కానీ అవి భలేగా చికాకు పెడతాయి / సంతోష పరుస్తాయి అన్న విషయాన్నీ గమనించేలా చేశాను. 
  • గొప్పగా కార్లలో, పెద్ద బండ్ల మీదే వెళ్లడం కాదు.. చిన్న చిన్న బండ్ల మీద కూడా సౌకర్యముగా వెల్లోచ్చును. 
  • చిన్న బళ్ళు అని చులకన చేస్తాం కానీ అవి పెద్ద బండ్లకి ఏమీ తీసిపోవు. కాస్త వేగంగా వెళ్ళక పోవచ్చును. కానీ భద్రముగా, అనువుగా, తేలికగా వెళ్ళి రావొచ్చును. 
  • రహదారి మీద ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ, డ్రైవింగ్ చేస్తూ వెళ్ళి రావొచ్చును. 
  • పెద్ద బళ్ళ మీద 80-100 kmph తో వెళతాం, చిన్న బళ్ళ మీద 50-60 kmph తో వెళతాం. సగటు 30-40 కిలోమీటర్ల వేగం తక్కువ. అంతే. 
  • సరైన ప్లానింగ్ ఉంటే హాయిగా, సౌఖ్యముగా చిన్న బండ్ల మీద కూడా వెళ్ళి రావొచ్చును. Travel as you like అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాను. Make your own roads అంటే ఏమిటో కూడా తెలిసేలా చెయ్యవచ్చు. 
  • ఒకవేళ బండి పాడయినా వదిలేసి రావొచ్చును. అవి పోతే - పెద్ద బండ్లతో పోలిస్తే కొద్దిగా ఖర్చు తక్కువ. పెద్దగా ఇబ్బందీ కాదు. 
  • పాడయినా నెట్టుకుంటూ వెళ్ళొచ్చు. తేలికగా వేరే బళ్ళకు కట్టి లాక్కెళ్ళవచ్చు. 
  • సౌకర్యాలు ఎక్కువగా ఉన్న చిన్న బళ్ళ మీద వెళితే - ప్రయాణం హాయిగా ఉంటుంది. హాయిగా జర్నీని ఆస్వాదించొచ్చు. 
  • నాకెప్పుడు ఇలా ప్రయాణాల్లో అడ్డంకులు రాలేదు. బృంద ప్రయాణాల్లో అనుభవం సంపాదించాను. కానీ ఈసారి జరిగినదే మొదటిసారి అడ్డంకి.. ఆ అనుభవాలు నన్ను ఈ పరిస్థితిని తట్టుకొనేలా చేశాయి. 
  • సింపుల్ మెకానిజం ఉన్న బళ్ళ మీద వెళితే - పాడయినా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. 
  • అతి తక్కువ ఖర్చులో వెళ్ళి - రాగలం అని తెలియచేశాను. ఈ బండి పాడు కాకుండా ఉన్నట్లయితే - కేవలం 5 లీటర్ల పెట్రోల్ తో వెళ్ళి వచ్చేవాళ్ళం. అప్పటికీ ఇంకా పెట్రోల్ మిగిలే ఉంది. దానితో మిగిలిన ఆ ముప్ఫై కిలోమీటర్లు తేలికగా వెళ్ళగలం. అంటే 310 kms = ( 5 లీటర్లు @ 72 ) Rs. 360 / ముగ్గురం = చాలా తక్కువ ఖర్చు. బండి మీదే మొత్తం ప్రయాణం పూర్తి కాలేదు కాబట్టి మైలేజ్ మరియు ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అన్నది చెప్పలేను. 
  • దారిలో రోడ్డు ప్రక్కన షాపుల్లో, హైవే ల మీద చిన్న కొట్లు పెట్టుకొని అమ్ముకొనే వారి వద్ద చిరుతిళ్ళు కొని, తింటూ వెళితే ఆ కిక్కే వేరప్పా... 
  • చిన్న బళ్ళు మీద లాంగ్ డ్రైవ్ అంటే నవ్వుకుంటారు కానీ వాటి మీద కూడా ప్రయాణం అద్భుతముగా ఉంటుంది. ఆస్వాదించే మనసు ఉండాలే గానీ - సైకిల్ మీద ప్రయాణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 
  • మన డ్రైవింగ్ కి అనుకూలమైన వాటి మీద వెళ్ళితే మరీ మంచిది. 
  • రేపు వారి భవిష్యత్తులో - వారి వారి స్నేహితులతో అలా డ్రైవ్ కి వెళ్ళితే - ఎలా ఉండాలో, ఎలా పరిస్థితులని తట్టుకోవాలో తెలిపే ఇదొక పాఠం అన్నమాట. ఇలాంటి పాఠాలు చిన్నతనంలోనే నేర్చుకుంటే మరీ మంచిది
  • ముఖ్యముగా అప్పుడు బండి పాడవటం కూడా ఒక రకముగా సాయం చేసింది. అలా పాడయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలా అప్పుడు మసలుకోవాలో దగ్గర నుండి చూసి, అనుభవపూర్వకముగా తెలుసుకున్నారు. 
  • మళ్ళీ మళ్ళీ అలా లాంగ్ డ్రైవ్స్ కి అలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందం పొందటానికి వెళ్ళేలా - ఈ టూర్ ఉత్సాహాన్ని ఇచ్చింది. 
  • బాసర నుండి కుంటాల జలపాతం 100 kms. కి వెళ్ళాలనుకున్నాం. కానీ సమయం లేక వెళ్ళలేదు. మరొకసారి మళ్ళీ ఇలాగే వెళ్ళొస్తాము. 
మొత్తానికి మా పుష్కరాల ప్రయాణం అలా జరిగింది. చాలా చాలా జ్ఞాపకాలని మూట గట్టుకున్నాం. కొంత టెక్నికల్ గా వ్రాయాల్సి వచ్చింది.. + నా బీజీ జీవితం వల్ల పోస్ట్స్ నెమ్మది అయ్యాయి. అందులకు మన్నించండి. ఇదంతా కాస్త వివరముగా వ్రాయటానికి గల కారణం - ఈ ట్రావెలాగ్ చదివి, ఆ స్పూర్తితో మీరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు, మరింత సౌఖ్యముగా వారి వారి ప్రయాణాలు చేస్తారని. అదే నిజమైతే ఇదంతా కష్టపడి చెప్పిన లక్ష్యం నెరవేరినట్లే..ఈ బ్లాగ్ లక్ష్యమూ, బ్లాగ్ కవర్ ఫోటోలో చెప్పిందీ అదే కదా..



- శుభం - 


2 comments:

దినేష్ said...

మొత్తం మూడు భాగాలు ఇప్పుడే చదివానండీ, చాలా బాగా వ్రాశారు. పన్నెండేళ్ళ క్రితం పుష్కరాలకి హైదరాబాద్ నుండి నేను, నా స్నేహితుడు బసరకి ఇలాగే బైక్ మీద వెళ్ళాం కాని, యిద్దరం యువకులం కావడంతో ఏమి ఆలోచించలేదు, ఎటువంటి ఇబ్బంది రాలేదు. కాకపొతే తరువాత హైదరాబాద్ సిటీలోనే నాకు జరిగిన బైక్ యాక్సిడెంట్ (నా తప్పు లేదు, వెనుక నుండి వచ్చి కొట్టిన దెబ్బ) నా ఆలోచనా విధానాన్ని మార్చేసింది. అదే యాక్సిడెంట్ హైవేలో జరిగుంటే బతకడం ప్రశ్నే లేదు. అదొక్కటే ఆలోచించాల్సిన విషయం బైక్ మీద లాంగ్ డ్రైవ్ గురించి, అదీ పిల్లలతో.

Raj said...

ట్రావెలాగ్ నచ్చినందులకు కృతజ్ఞతలు. మీకు అలా జరిగినందులకు బాధగా ఉంది. కొన్ని అంతే.. మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయి. ఇక పిల్లలతో అన్న విషయం - వారు పెద్దయాక ఇలాగే తమ స్నేహితులతో వెళితే ఎలా ఉండాలో ఇదంతా ప్రాక్టికల్ గా చూపించాను. తండ్రిగా అది నా బాధ్యతగా భావించాను కాబట్టి అలా వెళ్ళాం. వారు ఎంతగానో తెలుసుకున్నారు కూడా. జీవితంలో ఏది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలుసు.. బాగుండాలని - ఈ విషయంలో సన్నద్ధం చెయ్యడం.

Related Posts with Thumbnails