Friday, December 21, 2012

Good Morning - 213

Telugu Quotations


ప్రేమంటే - ప్రేమించిన వారితో సంతోషముగా, 
జీవితాంతం కలసి ఉండటం కాదు.. 
వారు మనకి దూరమైనా - 
జీవితాంతం వారి సంతోషాన్ని కోరుకోవటం. 

ప్రేమంటే అంతే కదూ! ప్రేమించినవారి శ్రేయస్సు, అభ్యున్నతిని, సంతోషాన్ని, ఎదుగుదలనీ.. అంతా మంచే కదా కోరుకునేది. అదే నిజమైన ప్రేమ. కానీ ఈరోజుల్లో కాసింత ఎడబాటు రాగానే ఎదుటివారిని నానా దుర్భాశాలడటం, తన ఆధిక్యత ప్రదర్శించటానికి దాడి చెయ్యటం, కొండకచోట యాసిడ్ దాడులూ, కత్తులతో దాడి చెయ్యటం.. జరుగుతునే ఉన్నాయి. కానీ నిజమైన ప్రేమికుల లక్షణం అది కాదు. ఎదుటివారి బాగునీ, వారి సంతోషాన్ని కోరుకోవటం.. 

ప్రేమలో ఉన్నప్పుడు వారి పట్ల చూపే శ్రద్ధ, అభిమానం, ఎదుటివారి సంతోషం కలిగించటం లాంటివి ఎలా చూపిస్తామో - వారు మనకి దూరం అయినప్పుడు, అప్పుడు కూడా చూపిస్తే అదే నిజమైన ప్రేమ. కొన్ని కారణాల వల్ల దూరమైనా ఆ విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. తనవారి తప్పున్నా అది ఆలోచించి, అర్థం చేసుకోగలగాలి. నిజానికి ఇలా దూరం అవగానే కోపం, అసహ్యం, ప్రతీకార కాంక్ష కలుగుతుంది. కాదనను. అవి ఆ వ్యక్తిని క్షణకాలం కూడా నిలవనీయవు. ఎదుటివారి మీద పగ తీర్చుకోమంటుంది.. వీటన్నింటికీ తట్టుకోవటం కష్టమే అయినా, తట్టుకొని ఎదుటివారిలో సంతోషాన్ని కోరుకోవటం చాలా గొప్పవిషయం. అది అందరిలో రాదు కూడా. అవతలివారు సంతోషముగా ఉన్నారు అన్న వార్త విని / చూసి ఆనందపడటమే నిజమైన ప్రేమికుల లక్షణం. 

కానీ, నన్ను మరచి, ఇంకొకరితో ఎలా సంతోషముగా ఉన్నారు చూడు అనే నిందలు ప్రేమ కాదు.. జెలసీ / ఈర్ష్య అంటారు. ఆ కోణంలో తరవాత ఆలోచిద్దాం. 

ఇదే భావం స్నేహంలో కూడా ఉంటుంది. నిజానికి ప్రేమ, స్నేహం - ఈ రెండూ పరిచయ పునాదుల మీదే ఏర్పడతాయి. లోతుగా వెళుతున్నా కొలది వారిద్దరి బంధాన్ని ప్రేమగానే వేరేవారు అనుకుంటారు. కానీ, ప్రేమకీ, స్నేహానికి మధ్య సన్నని గీత ఉంటుంది. అది అందరికీ కనిపించదు కూడా. మంచి స్నేహితులు దూరమైనా - ప్రేమికులు దూరం అయినప్పుడు కలిగే దాదాపు అన్నీ భావాలు ఇక్కడా కలుగుతాయి. నిందాపూర్వక మాటలు వెలువడుతాయి. మొదట్లో అవి మామూలే.. ఆతరవాత అవతలివారి సంతోషాన్ని కోరుకొంటారు. అలాంటివారిని ఈ ఆన్లైన్ లోనూ, నిజజీవితములోనూ చూశాను. ఆ భావనని అనుభవిస్తున్నవారిని అడిగితే - అదో తీయని బాధగా వర్ణించటం కొసమెరుపు. 

No comments:

Related Posts with Thumbnails