Wednesday, July 6, 2011

ఆషాడమాసం - 1

నా రెగ్యులర్ స్టైల్ కి కాస్త భిన్నముగా వ్రాశాను.. ఎలా ఉందో చెప్పండి.

ఆషాడ మాసం - ఓహ్! చిత్ర విచిత్ర సమాహారాల మాసం. ఒక్కొక్కరికీ ఒక్కో అనుభూతులనిచ్చే మాసం. తెలుగు నెలల్లో నాలుగో మాసం అయిన ఈ ఆషాడం ఒక్కొక్కరికీ ఒక్కో అనుభూతిని ఇచ్చే మాసం. కొందరికి సిరి సంపదలను, భోగ భాగ్యాలనీ, మరికొందరికీ ఏమీ దిక్కుతోచనట్లు చేసేస్తుంది. అందుకే అన్నాను ఇది విచిత్ర మాసం అనీ. నాకు అలానే అనిపిస్తుంది.

మొదట్లో ఈ ఆషాడం వచ్చింది అంటేనే ఎందుకో దిగాలుగా అనిపించేది. ఈ విచిత్రమైన పేరులా ఉండే ఈ నెల పేరు వింటుంటే ఏదో తెలీని హాయినీ, మానసిక చికాకులనీ రెండింటినీ సమముగా కలుగచేసేది. నిజం చెప్పాలంటే - చింత పాలు ఎక్కువగా ఉండేది. చింత పాలు అంటే చింత చెట్టు యొక్క పాలు అనుకునేరు. కాదండీ.. మహాప్రభో! కానేకాదు. చింత అంటే బాధ, విచారం, ఏదో తెలీని నెమ్మది తనం, అలా మబ్బుగా, నిస్సారముగా జీవనం కొనసాగించటం.. వల్లనేమో నాకు అలా అనిపించేది. అలాని అనిపించటానికి - నేను తప్పనిసరిగా చేసేపనులూ, ఎదురయ్యే పనులూ, చాలావరకు తప్పించుకోలేనివీ పనులూ, వేరేవారి బాధలూ వినటం.. అన్నీ కలగలసి, ఎడతెగని ఆలోచనలతో బ్రతుకు భారముగా అనిపించటం వల్లనేమో కావచ్చును. ఇక్కడే చాలామందికి సంసార వైరాగ్య భావన కూడా కలగవచ్చును. ఆఫ్కోర్స్. నాకూ అలాగే అనిపించింది కూడా.. హ ఆహా హ్హా

మొదట్లో ఇలా అనిపించటం కేవలం నాకొక్కరికేమో అని అనుకున్నాను. కాదు.. కాదు.. నాలా చాలామంది ఉన్నారని తెలిశాక కాస్త ధైర్యం. అదేమిటో గానీ, మనం ఎంత అధ్వాన్న పరిస్థితులో ఉన్ననూ, మనలాంటి వారిని ఇంకొకరిని చూశాక, ఎవరెస్ట్ ఎక్కి దిగివచ్చినంత రిలీఫ్ కనిపిస్తుంది. మీకేమో కానీ, నాకు మాత్రం అంతే. నిజానికి అలా అనిపించేలా ఎదురయ్యే సమస్యలు అంత పెద్దవి కావు.. నిజానికి అవి చాలా చిన్నవే అని తెలిసేసరికే చాలా సమయం పట్టింది. అవును.. నిజముగా అవును. అలా చిన్నవే అని తెలిశాక జీవితం అంటే ఇంతేనా అనే ధీమా వచ్చేది. ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత నవ్వు వచ్చేది, అలాగే నా పొరబాట్లూ తెలిసోచ్చేది.

సాధారణముగా జూన్ లో మొదలయ్యి జూలై లో అయిపోయే ఈ అచ్చ తెలుగు నెల - సంగతి చెప్పాలీ అంటే ఒక మహా గ్రంధమే వ్రాయొచ్చును. ఎన్నెన్ని చిన్ని చిన్ని సరదాలూ, ఎన్నో జీవితాంతం గుర్తుండిపోయే మధుర భావనలూ, ఏమిటీ కిం కర్తవ్యం అన్నట్లు ఉండే సమస్యలూ.. ఓహ్!.. అది అనుభవించవలసినదే కానీ, వర్ణించటానికి ఏమాత్రం వీలుకాదు. చైత్రమాసం తరవాత ఈ నెల వస్తుందంటే నాకు అదో బెంగలా ఉండేది. ఎందుకో తెలీదు కానీ, చాలాకారణాలు అలా నన్ను మార్చాయి. ఇప్పుడిప్పుడే కాస్త మారాను. ఈ పదే పదే అవే అనుభవాలు పొందడమే కావచ్చును.

క్రొత్త ఆవకాయ, క్రొత్త కుండ నీళ్ళూ, ఉగాది పచ్చడి రుచి ఏమిటో ఇంకా తెలుసుకోక ముందే, గుల్ మెహర్ చెట్ల అందాల ఆస్వాదన ఇంకా ముగియక ముందే ఈ ఆషాడం ఎంచక్కా మన పిలుపుతో ఏ మాత్రం పనే లేకుండా - నేనొచ్చేశా అంటూ నట్టింట్లో కూర్చొని, వింతగా ఓర చూపులు చూస్తూ, కొంటెగా నా వైపు నవ్వుతున్నట్లు అనిపిస్తుంది. ఆ నవ్వులో ఎన్నెన్నో అర్థాలు. కనీ కనపడనట్లు చూచాయగా తెలిసే అర్థాలు. ఒక నిమిషములో సుఖం, మరో నిమిషములో బాధ - ఓహ్! జీవితము మీద తీపినీ, వైరాగ్యాన్నీ కలుగచేసేదిలా అనిపించేది.

అతి కష్టం మీద జీవిత భాగస్వామిని ఎన్నుకొని, కట్నకానుకలూ, ఆడంబరాలు, లాంచనాలు అన్నీ బాగా అనుకోని పెళ్ళిచేసుకొని ఒక ఇంటివారిమి అవుతాము కదా.. పెళ్లి హడావిడి కాస్త తగ్గి, కాస్త రెస్టు తీసుకొని, ఆ అలసట పోయాక "విందు భోజనానికి" కూర్చోబోతామా! కాస్త ఏదో అన్నప్రాసన అన్నట్లు కాస్త ఆవకాయతో నాలిక మీద మీద వేసుకొని, ఆ పిమ్మట ఆ పళ్ళెములో స్వీటుని కొరుక్కు తిందామా? లేక బిర్యానీ ముక్కని లాగిద్దామా? అని అనుకుంటుండగానే హమ్మో ఆషాడం వచ్చే అంటూ ఇద్దరూ వేరవక తప్పదు.. ఇలా విందు భోజనం ముందు పెట్టి, స్టార్టర్ సూపు కూడా అవకముందే, నోటివద్ద కూడు లాగేసుకున్నట్లు - ఏమిటీ దారుణం అరవాలనిపిస్తుంది. కానీ అరవలేము. లోలోన కుములుతూ, చ్చస్ - ఇంకో రెండు రోజులు ఉంటే "అన్నీ సరిగ్గా" చూసేవాడిని కదా.. కాస్త తుత్తి పడేవాడిని కదా అని బాధతో, లోలోన కుములుతూ, పైకి హాయ్ హ్హి హ్హి అని నవ్వుతూ ఆస్కార్ అవార్డ్ పొందగలిగెంతగా వీరలెవల్లో నటన చూపెట్టక తప్పదు. ఏ మబ్బులు కనిపించినా పాత మల్లీశ్వరి సినిమాలోలా - నా ప్రాణానికి కాస్త కబురందించు, నేనిచట క్షేమమే అని తెలుపు.. తన కుశల సమాచారములు తీసుకొని రావా అని మౌన రాయబారాలు - ఓహ్!.. చెప్పుకోలేని, చెప్పలేని అవస్థ. ఇప్పుడైతే ఎంచక్కా సెల్ ఫోనులు వచ్చేశాయి కానీ, అప్పట్లోని వారి బాధలు చెప్పనలవి కాదు.

ఒక్కోసారి పులిమీద పుట్రలా తగుదునమ్మా అంటూ ఆచారి గారు వచ్చేస్తారు. ఇంటి పెద్దలతో యోగక్షేమాలు తెలుసుకొని, ఒక్కోసారి గుండెల్లో బాంబు వేసిపోతాడు. అది తను వేసింది కాదు. (దుష్ట) గ్రహాలన్నీ మన మీద కుట్ర పన్నాయా అని అనిపించేంతగా ఉంటుంది. ఏమిటా బాంబు అయ్యా అంటే - ఈసారి ఆషాడం అధికమాసం వచ్చిందీ అనీ.. అంటే ఇంకో నెల అదనం - అంటే ఇంకో ముప్ఫై దినాలు కాదు కాదు యుగాలు ఈ దూరాలు తప్పవు.. ఈ ఆషాడం, పాశాడం అన్న వారికి దినాలు పెట్టాలన్నంత కోపమూ వస్తుంది. (పాపం క్షమించును గాక) వార్నీ ఇలా కూడా ఉంటాయా?.. ఇవన్నీ తెలిస్తే అసలు ఇప్పుడే పెళ్ళే చేసుకోను గాక చేసుకోబోయేవాడిని కానుగా. తీరికగా ఆ తరవాతే చేసుకొనేవాడిని గా అనే ఆలోచనతో సగం అవుతాము.. (ఉన్న సగం వారి పుట్టింటికి పోయిందాయే మరి.) కొంతలో కొంత నాదైతే సింగిల్ ఆషాడం మాసం ఉన్నప్పుడు జరిగింది కానీ, ఈ డబుల్ ఆషాడ మాసాలు ముందు పెళ్లి చేసుకున్నవారు యే యే అవస్థలు ఎలా పడ్డారో!.. ఎలా తట్టుకున్నారో పాపం.!

పోనీ ఇప్పుడే వెళ్లి తనని చూద్దాం అనుకొని అక్కడికి వెళదాం అనుకుంటే పోవద్దు అంటా! సింగినాథం జీలకర్ర లా ఇక్కడే ఇంకోటి - అల్లుడు అత్తని చూడకూడదు ట. హా! చూస్తే ఏమవుతుంది..? అయినా నేను చూసేది తనని కాదు.. నా ప్రాణాన్ని అని కడుపు కాలి (నిజానికి ఎక్కడెక్కడో ఏదేదో కాలిపోతుంటాయి ఆపాటికి) అంటే - అది అనాదిగా వస్తున్న ఆచారం, అదంతే నీవు నోర్మూసుకో అని హుంకరింపులు. నీకేం తెలీదు.. అనీ విసుర్లు.. ఆ బాధ చెప్పుకొని, కాస్త ఓదార్పు పొందుదామంటే తను అక్కడ, మనం ఇక్కడ. ఇంట్లోవారిపై అలిగి చెప్పులేసుకొని బయటకెళ్ళడమే ఇక తరవాయి. సన్నని వర్షం తుంపర పడుతున్నా, గీతాంజలి సినిమాలో నాగార్జున నడిచినట్లుగా అలా నానుతూ, సాగిపోయి, అట్నుంచి యే సినిమా హాల్ కి పోయి, ఆ బాధకి తెరపైన ఆడుతున్న సినిమా ఏమిటో, కథ ఏమిటో కూడా తెలీకుండానే చూసేసి, అక్కడికివచ్చిన జంటలని చూసి - లైసెన్స్ ఉండీ ఇంట్లో మరిచి, ట్రాఫిక్ ఇన్ పెక్టర్ కి దొరికిపోయి, హాయిగా రోడ్దేమ్మట - అన్నీ లైసెన్సులు దగ్గర పెట్టుకొని హాయిగా వెళ్ళే ఇతరులని చూస్తూ అసూయపడేవారిలా అప్పుడు పెట్టిన మొహములా పెట్టి, బాధపడి, యే అర్ధరాత్రికి ఇంటికి చేరుకోవటమ్. తలుపు తీసిన వదినమ్మనేమో అలా మనల్ని చూసి, ముందు హయ్యో పాపం మరిది అనేలా ఫేసు పెట్టి, "ఏం! మరిదీ సినిమాలో మా చెల్లాయ్ కనిపించిందా?.. " అని వెనకాల మాత్రం అటుప్రక్కన తిరిగి నవ్వుకోవటం.. హబ్బా!.. ఏమిటీ నాకీ శిక్ష అనుకుంటూ ఏదో మమ అనిపించేలా తినేసి, తొంగోవటమే!

ఇక బయటకి వెళ్ళితే మిత్రులతో బాధ. "ఏరా!.. మొత్తానికి నల్ల పూసయ్యావురా.. ఇన్నేళ్ళు తిరిగిన దోస్తానాన్ని వదిలి, హాయిగా ఎంజాయ్ చేస్తున్నావ్ రా.." అని ఎకసేక్కాలు. (జరిగిందేమిటో చెప్పాలనిపిస్తుంది - కాని చెప్పలేం. చెబితే ఇంత వేస్టుగాడివా.. మన మిత్రుల్లో నీవే వేస్టు ఫెలోవి అంటూ మాటలు.. అవి వింటే రోషం పొడుచుక వస్తుంది. ఇంకా హేళన అవుతాం.. నోర్మూసుకోవడం ఉత్తమం..) పైకి మాత్రం - సిగ్గుపడుతూ ఏదో సాధించినట్లుగా మొహం పెట్టాలి. ఒహడేమో ఒంటరిగా దొరికినప్పుడు - ఎక్కడలేని ఆత్రముగా "సక్సెస్" అయ్యావా అని కూపీ. (వాడోక్కడికీ చెబితే చాలు మిత్ర బృందమంతటికీ ఆ వార్త చేరిపోతుంది) కాకున్నా అవునట్లు తలూపాలి. ఎక్కదేమైనా ఇబ్బందా? ఉంటే ఫోన్ ఎ ఫ్రెండ్ లా సహాయం చేస్తా అని సూచనలు.. వద్దురా బాబూ! నాకు అన్నీ తెలుసు క్లాస్మేట్ శేఖర్ గాడు ఇచ్చిన బుక్సూ, సీడీ లూ, అంతర్జాల అపోసనా అన్నీ చెప్పాలనిపిస్తుంది.. కాని ఎవరో గొంతు నోక్కేసినట్లు ఫీలింగ్. మౌనముగా ఆ బాధని భరిస్తూ, పైకి మాత్రం నవ్వుతూ ఉండాలి.

మనం ఇంత బాధల్లో ఉంటామా.. వాళ్ళ బాధ వారిది. ఇంకా దీనికి పార్టీ ఏదిరా? అని నిస్సుగ్గుగా అడగటాలు. (మనం ఇలా అడిగినప్పుడు ఆ ఆలోచన కొంగెత్తుకెల్లిందేమో!) దీపక్ గాడి ఇంట్లో ఎవరూ లేరు..ఈరాత్రికి అందరం అక్కడే - అన్నింటికీ కలిపి ఓ రెండువేలు ఇవ్వరా - అని పేరుకే అడిగి జేబులోంచి చేయి పెట్టి తీసుకున్నంత చనువుగా పార్టీ అరేంజ్ చేస్తారు. అక్కడ సమస్తం చర్చకి వస్తాయి. అక్కడికి రానివారి గురించీ, పడరానివారి గురించీ మాటలు.. రాక ఆ మాటలు పడేకన్నా, వచ్చిందే ఉత్తమం అనేలా ఉంటాయి - వారికి మందు ఎక్కువైనా కొద్ది. మనం ఒకప్పుడు ఇలా మాట్లాడినప్పుడు ఈ నొప్పి రాదు. అదేమిటో ఈ ఆషాడం లోనే ఇలా వస్తుంది. ఒక రకముగా కనువిప్పు మాసం అనుకోవాలేమో!.

ఇది ఇలా ఉంటే ఇక మిగిలినవారి బాధలు ఇంకోదాంట్లో చెప్పుకుందామే!. అంతవరకూ నిరీక్షణ తప్పదు.

No comments:

Related Posts with Thumbnails