Tuesday, January 11, 2011

Social NW Sites - 1 - శ్రీకారం

ఈ సృష్టిలో మధురాతి మధురమైన వాటిల్లో స్నేహం కూడా ఒకటి. మన జీవితములో ఒక భాగముగా, అసలు స్నేహం చెయ్యని మనిషి - ఒక వింత పశువు అనిపించేలా - కనిపించే స్నేహం చాలా లోతైనది. గంభీరమైనదీ, అద్భుతమైనదీ కూడా. చిన్నప్పటి నుండీ ఇంటి పరిసర ప్రాంతాలలో ఉండే వారితో మొదలెట్టిన స్నేహం - ఆ తరవాత పాఠశాలలోనూ, కాలేజీల్లోనూ.. చేసే ఉద్యోగాలోనూ.. ఆఖరికి జీవిత మలిసంధ్యలో కూడా కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు కూడా ఇంకా క్రొత్త క్రొత్త స్నేహాలు చేస్తూనే పోతూ ఉంటాము. నిజానికి ఇదో అంతులేని దాహం అని అనుకుంటాను..

మౌఖిమముగా చేసే స్నేహాలు కాకుండా, కలం స్నేహాలూ, ఫోన్ స్నేహాలూ, SMS స్నేహాలూ.. ఇలా ఎన్నో వచ్చాయి. వాటన్నింటినీ అందరూ విశేషముగా ఆదరించారు. ఇప్పుడు అంతర్జాలముతో ప్రపంచమే కుగ్రామం అయిన సందర్భములో - ఈ ఇంటర్నెట్ లోని సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వల్ల ప్రపంచములోని అన్ని వర్గాల ప్రజలూ, జాతులూ, తరతమ భేదం, లింగ భేదం.. అంటూ ఏమీ పట్టించుకోకుండా ఈ ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వల్ల స్నేహాలు చేస్తూనే ఉన్నారు. నెటిజనులూ వీటిని బాగానే ఆదరించారు.. ఆదరిస్తూనే ఉన్నారు. ప్రతి రోజూ క్రొత్తవారు చేరుతూనే ఉన్నారు..

నేనూ అలాగే వాటిల్లో రెండున్నర సంవత్సరాల క్రిందటే చేరాను. అందులో బాగానే స్నేహాలు సంపాదించుకున్నాను. ఇప్పటివరకూ ఒక యాభై వరకూ మంచి మిత్రులని సంపాదించుకోగాలిగాను.రకరకాల వ్యక్తులూ, రకరకాల అనుభవాలు.. కొన్ని మధురాతిభూతులు, కొన్ని మనసు చివుక్కుమనిపించే విషయాలు.. దాదాపు అన్నీ చవి చూశాను. అందులో అమాయకులనూ చూశాను.. మోసాలు చేసేవారినీ చూశాను.. మోసపోయేవారినీ చూశాను.. ఏమీ తెలీక ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో తెలీని వారినీ చూశాను. నాకున్న అనుభవాలు చాలా ఉన్నాయి. అవన్నీ నాతోనే అంతం అయ్యే బదులు నలుగురికీ పంచాలన్న కోరికా - నేనిలా మోసపోయాను, అలా మోసపోకుండా ఉండాలీ అంటే నేనేమి చెయ్యాలో చెప్పమనే మిత్రులూ, మిత్రురాళ్ళు.. ఒక్కక్కరి వ్యధలూ, బాధలూ, సంతోషాలూ, వైట్ కాలర్ హారాస్మేంట్.. ఇలా దాదాపు అన్నీ చవి చూశాను.

వారికోసం ఒక్కక్కరికీ చెప్పలేక - అందరికీ ఉపయోగపడాలని ఇక్కడ చెప్పాలని అనుకున్నాను. వాళ్ళందరూ బాగా అడిగితే కాదనలేక - ఈ పని మొదలెట్టాను. మీకూ ఉపయోగపడవచ్చన్న ఆలోచనతో ఈ బ్లాగుని వేదికగా మీకు చెప్పాలనుకుంటున్నాను. కాస్తో కూస్తూ ఎవరికైనా ఒక్కరికైనా సహాయపడుతాయని బాగా నా అనుభవాన్ని జోడించి మరీ వ్రాయబోతున్నాను. వీటిల్లో ఎక్కువగా మళ్ళీ అప్డేట్స్ ఉంటాయి. ఎందుకంటే - ముందుగా అనుకొని వ్రాస్తున్న విషయాలు కావు. మనసులో ఒకటి అనుకొని ఫ్లో లో వ్రాస్తూ, అనుభవాలు కలుపుకుంటూ అలా సాగిపోవటం వల్ల అప్డేట్స్ ఆనివార్యం. ఈ విషయాన్ని ఆ యా టపాల్లో చెబుతాను.

ఇదంతా నా అనుభవాలే - కన్నవీ, విన్నవీ, చూసినవీ కాబట్టి వివరముగా చెప్పాల్సినది ఉంటుంది. అసలు ఇలా వ్రాస్తానూ అని కూడా అనుకోలేదు. ఆధారాల కోసం,  కొన్ని ఫోటోల కోసం చాలారోజులుగా సేకరించాల్సి వస్తుంది. అంత సమయం లేదు కాబట్టే - ముందుగా ఫ్లో లో వ్రాస్తూ పోతుంటాను. ఎప్పుడైనా మధ్యలో ఏదైనా దొరికితే - అప్డేట్స్ లో (ఆ టపాలో క్రింది భాగాన) మళ్ళీ ఎడిట్ చేసి పెడతాను. ఆ విషయం గమనించగలరు. ఇది ఎవరినీ ఇబ్బంది పెట్టడానికో, కష్టపెట్టదానికో, నా పగ (?) తీర్చుకోవటానికో వ్రాయలేదు అని అలాని అనుకునేవారు గమనించగలరు.

No comments:

Related Posts with Thumbnails